Telugu Global
Telangana

రేవంత్ వ్యాఖ్యలపై పోలీస్ అధికారులు సీరియస్.. వివరణ కోరే అవకాశం?

గంట సేపు సిట్ కార్యాలయంలో కూర్చున్న రేవంత్.. దర్యాప్తుకు పనికొచ్చే ఒక్క విషయాన్ని కూడా చెప్పలేదు. పైగా బయటకు వచ్చి విలేకరుల ముందు అనవసరమైన ఆరోపణలు చేశారు.

రేవంత్ వ్యాఖ్యలపై పోలీస్ అధికారులు సీరియస్.. వివరణ కోరే అవకాశం?
X

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ కేసును విచారిస్తున్న సిట్ అధికారిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పోలీస్ వర్గాలు సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. పేపర్ లీక్ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. గ్రూప్-1 పరీక్షలు రాసిన వారిలో దాదాపు 100 మందికి 103 మార్కులు వచ్చాయని.. వీళ్లందరూ నిందితుడు రాజశేఖర్ మండలానికి చెందిన వారే అని రేవంత్ ఆరోపించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సిట్.. రేవంత్‌కు నోటీసులు జారీ చేసింది. ఆయన చేసిన ఆరోపణలపై ఏవైనా ఆధారాలు ఉంటే చెప్పాలని కోరింది.

ఈ నెల 23న సిట్ కార్యాలయానికి వచ్చిన రేవంత్ రెడ్డి ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని సిట్ అధికారులు చెప్పారు. గంట సేపు కార్యాలయంలో కూర్చున్న రేవంత్.. దర్యాప్తుకు పని కొచ్చే ఒక్క విషయాన్ని కూడా చెప్పలేదు. పైగా బయటకు వచ్చి విలేకరుల ముందు అనవసరమైన ఆరోపణలు చేశారు. టీఎస్‌పీఎస్సీ కేసును విచారిస్తున్నసిట్ అధికారి, పోలీస్ కమిషనర్ (క్రైమ్స్) ఏఆర్ శ్రీనివాస్ ప్రాంతీయతను ప్రశ్నించారు. ఆయన ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి అని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ కూడా ఆంధ్రా వ్యక్తే అని రేవంత్ గుర్తు చేశారు.

ఒక ఆంధ్రా వ్యక్తి టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ చేస్తే.. దాన్ని ఆంధ్రా అధికారితో దర్యాప్తు చేయించడం ఏంటని విలేకరుల ముందు ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై పోలీస్ అధికారులు సీరియస్ అవుతున్నారు. ఏఆర్ శ్రీనివాస్ పుట్టిన దగ్గర నుంచి తెలంగాణలోనే ఉన్నారని.. ఆయన తల్లిదండ్రులు మాత్రం ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన వారని అధికారులు అంటున్నారు. అయినా సరే, ఒక పోలీస్ అధికారి ప్రాంతీయతను ముందుకు తీసుకొని వచ్చి.. ఆయన చిత్త శుద్దిని ప్రశ్నించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

కీలకమైన కేసును దర్యాప్తు చేస్తున్న అధికారి పట్ల లేనిపోని ఆరోపణలు చేయడం తగదని అంటున్నారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరాలని కూడా పోలీస్ అధికారులు భావిస్తున్నారు. ఏ కారణంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారో చెప్పాలని.. లేదంటే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. మరి ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

First Published:  27 March 2023 3:33 AM GMT
Next Story