Telugu Global
Telangana

పల్టీ కొట్టిన కారు.. వెళ్లి చూస్తే బ్యాగుల్లో నోట్ల కట్టలు

హైదరాబాద్‌ నుంచి ఖమ్మం వైపున‌కు ఓ ఇన్నోవా వెళ్తోంది. నాయకన్‌గూడెం దగ్గర పోలీసులు తనిఖీలు చేస్తుంటే.. కారు ఆపకుండా వేగంగా వెళ్లింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ కారును చేజ్ చేశారు.

పల్టీ కొట్టిన కారు.. వెళ్లి చూస్తే బ్యాగుల్లో నోట్ల కట్టలు
X

తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌కు ఒక్క రోజు మాత్రమే గడువు ఉంది. దీంతో రాజకీయ పార్టీలు ప్రలోభాలకు తెరలేపాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద మొత్తంలో నగదును ఓటర్లకు పంచేందుకు సిద్ధమయ్యాయి. మరోవైపు అధికారులు సైతం డబ్బు పంపిణీ జరగకుండా చర్యలు తీసుకుంటారు. కానీ, అధికారుల కన్నుగప్పి డబ్బు సరఫరా చేసేందుకు పార్టీలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా కూసుమంచి దగ్గర నాటకీయ పరిణామాల మధ్య ఓ కారులో భారీగా నగదు పట్టుకున్నారు పోలీసులు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. హైదరాబాద్‌ నుంచి ఖమ్మం వైపున‌కు ఓ ఇన్నోవా వెళ్తోంది. నాయకన్‌గూడెం దగ్గర పోలీసులు తనిఖీలు చేస్తుంటే.. కారు ఆపకుండా వేగంగా వెళ్లింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ కారును చేజ్ చేశారు. దాదాపు 10 కిలోమీటర్ల వరకు పోలీసులు ఆ కారును వెంబడించారు. ఐతే దేవుడి తండా సమీపంలో ఇన్నోవా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ కారులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరికి గాయాలయ్యాయి.

బోల్తా పడిన కారును తనిఖీ చేసిన పోలీసులు రెండు బ్యాగులు గుర్తించారు. ఆ బ్యాగులు తెరిచిచూడగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ డబ్బు విలువ రెండు కోట్ల రూపాయ‌లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు కారులోని వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

First Published:  12 May 2024 5:43 AM GMT
Next Story