Telugu Global
Telangana

పోలీస్ జంట ప్రీవెడ్డింగ్ షూట్.. విమర్శకులకు సీవీ ఆనంద్ సమాధానం

అక్కడేదో ఘోరం జరిగిపోయినట్టు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. హవ్వ పోలీస్ కార్లు వాడుకుంటూ, యూనిఫామ్ వాడుకుంటూ పెళ్లి ఫొటోషూట్ ఏంటని కొందరు సెటైర్లు మొదలు పెట్టారు.

పోలీస్ జంట ప్రీవెడ్డింగ్ షూట్.. విమర్శకులకు సీవీ ఆనంద్ సమాధానం
X

వారిద్దరూ హైదరాబాద్ పోలీస్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా ప్రీ వెడ్డింగ్ షూట్ లో పాల్గొన్నారు. సహజంగా అందరూ సినిమా పాటలకు కాలుకదుపుతారు. కానీ ఇక్కడ పోలీస్ లు మరో స్టెప్ ముందుకేశారు. యూనిఫామ్ లో కారు దిగుతూ కొన్ని విజువల్స్ తీయించుకున్నారు. వాటిని ప్రీ వెడ్డింగ్ షూట్ లో వాడుకున్నారు. ఇంకేముంది అక్కడేదో ఘోరం జరిగిపోయినట్టు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. హవ్వ పోలీస్ కార్లు వాడుకుంటూ, యూనిఫామ్ వాడుకుంటూ పెళ్లి ఫొటోషూట్ ఏంటని కొందరు సెటైర్లు మొదలు పెట్టారు.


ఏ వృత్తిలో ఉన్నవారు, ఆ వృత్తిలో ఉన్నట్టుగా ఫొటోషూట్లు చేయించుకోవడం సహజం. కానీ ఇక్కడ పోలీస్ యూనిఫామ్ లో ఉంటూ వీడియోలు తీయించుకోవడంపై కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఆ ట్రోలర్లకు హైదరాబాద్ కమిషనర్ సీవీఆనంద్ సమాధానమిచ్చారు. ఆ జంట కాస్త ఎక్కువగా స్పందించిన విషయం తెలుస్తున్నా.. అందులో తప్పేమీ లేదన్నారు. పోలీస్ సింబల్స్ ని కానీ, పోలీస్ డిపార్ట్ మెంట్ ప్రాపర్టీస్ ని కానీ ఎక్కడా వారు తప్పుగా ఉపయోగించలేదని చెప్పారు.

పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం మహిళలకు సవాళ్లతో కూడుకున్నదని, అందులోనూ ఆమె పోలీస్ డిపార్ట్ మెంట్ లోనే తనకు జంటను వెదుక్కున్నారని, అది సంతోషించదగ్గ విషయం అని చెప్పారు. ఆ జంటకు తన శుభాకాంక్షలు తెలిపారు. వారు తనను పెళ్లికి ఆహ్వానించకపోయినా, వారిని కలసి ఆశీర్వదించాలని ఉందని అన్నారు. అదే సమయంలో మిగతావారికి కూడా ఆయన సున్నితంగా హెచ్చరించారు. ఇలాంటి ఫోటోషూట్ల సమయంలో ఉన్నతాధికారులకు సమాచారమివ్వడం మరచిపోవద్దన్నారు.

First Published:  17 Sep 2023 11:31 AM GMT
Next Story