Telugu Global
Telangana

'నమస్తే తెలంగాణ'పై కేసు.. ఎందుకంటే..?

ఐపీసీ సెక్షన్లు 505(1)(బీ)(సీ), 505(2) రెడ్‌ విత్‌ 109 ప్రకారం.. క్రైం నెంబర్‌ 154/2024 కింద 'నమస్తే తెలంగాణ'పే కేసు నమోదు చేశారని ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

నమస్తే తెలంగాణపై కేసు.. ఎందుకంటే..?
X

ప్రభుత్వాలు మారిన తర్వాత వైరి వర్గాలపై కక్షసాధింపు చర్యలు చూస్తూనే ఉంటాం. మాజీ మంత్రి మల్లారెడ్డి కాలేజీపై దాడుల్ని ప్రతిపక్షం రాజకీయ కక్షసాధింపులంటోంది. బీఆర్ఎస్ కి అనూకులంగా పోస్ట్ లు పెట్టే ఓ జర్నలిస్ట్ పై కూడా ఆమధ్య దాడి జరిగింది. కేటీఆర్ నేరుగా వచ్చి ఆయన్ను పరామర్శించారు, కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ దాడికి బాధ్యత వహించాలన్నారు. ఇప్పుడు ఏకంగా 'నమస్తే తెలంగాణ' పత్రికపై కేసు నమోదు కావడం విశేషం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎందుకీ కేసు..?

బేగంపేట విమానాశ్రయంలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీకి సంబంధించి పుకార్లు వచ్చిన మాట వాస్తవమే. మెయిన్ స్ట్రీమ్ మీడియాతోపాటు, సోషల్ మీడియాలో కూడా వారిద్దరూ భేటీ అయ్యారని వార్తలొచ్చాయి. అయితే 'నమస్తే తెలంగాణ'లో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఇమేజ్ ని డ్యామేజీ చేసేలా కథనాలు వచ్చాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీ ఎన్నికలకోసం చంద్రబాబు.. రేవంత్‌ సహాయాన్ని కోరారని.. ఆర్థిక సాయం కూడా చేయాలని అడిగారని, దానికి రేవంత్‌ అంగీకరించారని, చంద్రబాబు చెప్పినట్టల్లా రేవంత్ ఆడుతున్నారంటూ కల్పిత వార్తలిచ్చారనేది కాంగ్రెస్ నేతల ఆరోపణ. అసత్య కథనాలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఐపీసీ సెక్షన్లు 505(1)(బీ)(సీ), 505(2) రెడ్‌ విత్‌ 109 ప్రకారం.. క్రైం నెంబర్‌ 154/2024 కింద 'నమస్తే తెలంగాణ'పే కేసు నమోదు చేశారని ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌గౌడ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ రోజు రేవంత్‌రెడ్డి బేగంపేట ఎయిర్‌పోర్టుకు మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి, 3.37 గంటలకు వెళ్లిపోయారని.. చంద్రబాబు మధ్యాహ్నం 2.45 గంటలకు వచ్చి, 3.07 గంటలకు వెళ్లిపోయారని చెబుతున్నారు మహేష్ కుమార్ గౌడ్. రేవంత్‌రెడ్డి లాంజ్‌లో 10 నిమిషాలు మాత్రమే ఉన్నారని, చంద్రబాబు లాంజ్‌లోకి రాకుండానే వెళ్లిపోయారని వివరించారు. వారిద్దరూ కలుసుకునే అవకాశమే లేదన్నారు.

First Published:  10 March 2024 5:08 AM GMT
Next Story