Telugu Global
Telangana

తాయిలాల ప్లాన్ రివర్స్.. ఎన్నికల కమిషన్ సీరియస్

ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో పర్యటించి వెళ్లింది. వాళ్లు ఢిల్లీ వెళ్లారో లేదో, ఇక్కడ కుక్కర్ల పంపిణీ మొదలైంది. దీంతో ఎన్నికల కమిషన సీరియస్ అయింది. ఈసీ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.

తాయిలాల ప్లాన్ రివర్స్.. ఎన్నికల కమిషన్ సీరియస్
X

కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ పర్యటన ముగిసిన మరుసటి రోజే.. ఎన్నికల తాయిలాల పంపిణీకి తెరతీశారు కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి. ప్రలోభాల పర్వాన్ని కాస్త ముందుగానే మొదలు పెట్టారు. ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు కాబట్టి, కోడ్ అమలులో లేదు కాబట్టి.. తాను ఏం చేసినా చెల్లిపోతుందనుకున్నారు. పైగా ఫౌండేషన్ పేరుతో మాయ చేయాలనుకున్నారు. కానీ స్థానికులు ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయడంతో కంది శ్రీనివాస్ రెడ్డికి షాక్ తగిలింది. పోలీసులు కేసు నమోదు చేశారు. రేపు విచారణకు రావాలని ఆదేశించారు.

ఆదిలాబాద్ లో ప్రలోభాల పర్వం..

ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న కంది శ్రీనివాస్ రెడ్డి కొన్ని నెలల ముందుగానే పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగారు. కేఎస్ఆర్ ఫౌండేషన్ పేరుతో స్టిక్కర్లు అంటించి కుక్కర్ల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో ఈ కుక్కర్లు దాచి ఉంచారు. ఆమధ్య ఈ కుక్కర్ల వ్యవహారం తెరపైకి రావడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే కుక్కర్లు దాచి పెట్టారే కానీ, పంపిణీ చేయలేదు కదా అని తప్పించుకున్నారు కంది. కానీ శుక్రవారం ఆయన స్థానికులకు కుక్కర్ల పంపిణీ చేపట్టడంతో కొంతమంది ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశారు.

ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో పర్యటించి వెళ్లింది. ఈసారి ఓటుకు నోట్ల విషయంలో కఠినంగా ఉండాలని అధికారులకు సూచించారు ఎన్నికల సంఘం ప్రతినిధులు. నగదు, బహుమతుల పంపిణీకి అడ్డుకట్ట వేయాలని చెప్పారు. వాళ్లు ఢిల్లీ వెళ్లారో లేదో, ఇక్కడ కుక్కర్ల పంపిణీ మొదలైంది. దీంతో ఎన్నికల కమిషన సీరియస్ అయింది. ఈసీ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు కంది శ్రీనివాస్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. 171E , 427 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. రేపు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు.

సహజంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ తేదీ దగ్గరపడిన సమయంలో ఇలాంటి వ్యవహారాలు వెలుగు చూస్తాయి. కానీ నోటిఫికేషన్ రాకముందే కాంగ్రెస్ నేత ఇలా కుక్కర్లు పంచుతూ పట్టుబడటం విశేషం.

First Published:  7 Oct 2023 12:08 PM GMT
Next Story