Telugu Global
Telangana

రేపు ప్రధాని మోడీ పర్యటన.. సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. కాబట్టి ప్రజలు వేరే రూట్లను ఆశ్రయించాలని సీపీ సీవీ ఆనంద్ సూచించారు.

రేపు ప్రధాని మోడీ పర్యటన.. సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
X

ప్రధాని నరేంద్ర మోడీ రేపు (ఏప్రిల్ 8) తెలంగాణకు రానున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పచ్చజెండా ఊపడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. దీంతో సికింద్రాబాద్ ప్రాంతంలో రేపు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. కాబట్టి ప్రజలు వేరే రూట్లను ఆశ్రయించాలని ఆయన కోరారు.

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మోనప్ప జంక్షన్, గ్రీన్ ల్యాండ్స్, ప్రకాశ్ నగర్, రసూల్‌పుర సీటీవో, ప్లాజా, ఎస్‌బీహెచ్, వైఎంసీఏ, సెయింట్ జాన్ రోటరీ, సంగీత్ ఎక్స్‌రోడ్, ఆలుగడ్డ బావి, చిలకలగూడ జంక్షన్, ఎంజే రోడ్డు, ఆర్పీ రోడ్డు, ఎస్పీ రోడ్డులో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ రోడ్ల వైపు వెళ్లవద్దని కమిషనర్ సూచించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు కూడా ప్రధాని మోడీ వస్తారు. కాబట్టి అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు రైలు ద్వారా వెళ్లాలనుకునే వారు ముందుగానే స్టేషన్‌కు చేరుకోవాలని సూచించారు. ఇక సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షల కారణంగా ఉప్పల్ - సికింద్రాబాద్ మార్గంలో కూడా ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.

ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు..

ప్రధాని మోడీ సభకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ రూట్లో వచ్చే ఆర్టీసీ బస్సులు దోబీఘాట్‌లో.. ఆదిలాబాద్, నిర్మల్, మెదక్, సంగారెడ్డి వైపు నుంచి వచ్చే బస్సులు బైసన్ పోలో గ్రౌండ్‌లో.. రంగారెడ్డి, కర్నూల్, అచ్చంపేట, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట్, వరంగల్, యాదాద్రి రూట్లో వచ్చే బస్సులు ఆర్ఆర్‌సీ గ్రౌండ్‌లో పార్కు చేయాలని సూచించారు. ఇక రాజీవ్ రహదారి మీద నుంచి వచ్చే వాహనాలను కంటోన్మెంట్ పార్క్ గ్రౌండ్‌లో, పికెట్ డిపో ప్రాంగణంలో పార్కు చేయాలి. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాల నుంచి వచ్చే వాహనాలు నెక్లెస్ రోడ్డులో పార్క్ చేయాలి.

ఈ రోడ్లు మూసేస్తారు..

ప్రధాని పర్యటన సందర్భంగా టివోలి క్రాస్ రోడ్ నుంచి ప్లాజా ఎక్స్‌రోడ్ వరకు రోడ్డు ఇరువైపులా మూసేస్తారు. ఎస్‌బీహెచ్ ఎక్స్ రోడ్ నుంచి స్వీకార్, ఉపకార్ జంక్షన్ వరకు మూసేస్తారు. చిలకలగూడ, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ జంక్షన్, రేతిఫైల్ టీ జంక్షన్ల నుంచి పరేడ్ గ్రౌండ్ వైపు వచ్చే వాహనాలకు అనుమతి ఉండదు. సికింద్రాబాద్ స్టేషన్ వెళ్లాలంటే ప్రయాణికుల వాహనాలు క్లాక్ టవర్, రెజిమెంటల్ బజార్ రూట్ ఉపయోగించుకోవాలి.

First Published:  7 April 2023 4:44 AM GMT
Next Story