Telugu Global
Telangana

SC వర్గీకరణపై మోడీ కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటుకు ఆదేశం.!

ఈనెల 11న మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన అణగారిన వర్గాల విశ్వరూప మహాసభకు ప్రధాని మోడీ హాజరయ్యారు.

SC వర్గీకరణపై మోడీ కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటుకు ఆదేశం.!
X

తెలంగాణలో పోలింగ్‌కు గడువు దగ్గర పడుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. SC వర్గీకరణకు కట్టుబడి ఉన్నామంటూ ఇటీవల పరేడ్ గ్రౌండ్‌లో MRPS ఆధ్వర్యంలో నిర్వహించిన అణగారిన వర్గాల విశ్వరూప మహాసభలో ప్రకటించిన మోడీ.. ఇచ్చిన మాటను అమలులో పెట్టారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రక్రియను స్పీడప్ చేసేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబ సహా ఇతర సీనియర్ అధికారులను ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఈనెల 11న మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన అణగారిన వర్గాల విశ్వరూప మహాసభకు ప్రధాని మోడీ హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ 30 ఏళ్లుగా చేస్తున్న పోరాటాన్ని ప్రశంసించారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ నాయకత్వంలో తను కూడా పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. మందకృష్ణను హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు మోడీ. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీకి అనుగుణంగా కమిటీ ఏర్పాటు చేయాలని శుక్రవారం ఆదేశించారు.

ప్రధాని మోడీ హామీతో ఇప్పటికే తెలంగాణలో బీజేపీకి మద్దతు ప్రకటించారు మందకృష్ణ. ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. BRS ఎస్సీలను అణచివేసిందన్నారు. తెలంగాణలో 18 ఎస్సీ నియోజకవర్గాలున్నాయి. ఎన్నికల వేళ తీసుకున్న ఈ నిర్ణయం బీజేపీకి ఏ మేర లబ్ధి చేకూరుస్తుందనేది వేచి చూడాల్సిందే.

First Published:  25 Nov 2023 3:04 AM GMT
Next Story