Telugu Global
Telangana

అలా అయితే ప్రభుత్వ లోగోలు ఎందుకు వాడారు : కేంద్రంపై కేటీఆర్ ఫైర్

భారత రాజ్యంగం, పార్లమెంట్, ఏదైనా శాసన సభ చేసిన చట్టం ద్వారా పీఎం కేర్స్‌ను సృష్టించలేదని ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం తెలిపింది.

అలా అయితే ప్రభుత్వ లోగోలు ఎందుకు వాడారు : కేంద్రంపై కేటీఆర్ ఫైర్
X

కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 'పీఎం కేర్స్' అనే పేరుతో అత్యవసర సహాయ నిధిని ఏర్పాటు చేసింది. దేశవిదేశాల నుంచి ఈ నిధికి విరాళాలు ఇవ్వాలని కేంద్రం ప్రకటనలు కూడా జారీ చేసింది. కాగా, పీఎం కేర్స్ అనేది ప్రభుత్వంతో సంబంధం లేని పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్ అని పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం సమాచారం ఇచ్చింది. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. పీఎం కేర్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి సరిగా లేదని అభిప్రాయపడ్డారు.

భారత రాజ్యంగం, పార్లమెంట్, ఏదైనా శాసన సభ చేసిన చట్టం ద్వారా పీఎం కేర్స్‌ను సృష్టించలేదని ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ వివరణపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్.. అలాంటప్పుడు ప్రభుత్వ లోగో, ప్రధాన మంత్రి ఫొటో, ప్రభుత్వ వెబ్‌సైట్‌ను ఎందుకు ఉపయోగిస్తున్నారని ప్రశ్నించారు. ఎన్డీయే ప్రభుత్వం ఏ విధంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తుందో చెప్పడానికి ఇది ఓ క్లాసిక్ ఉదాహరణ అని కేటీఆర్ పేర్కొన్నారు.

పీఎం కేర్స్‌తో అత్యవసర సహాయ నిధిని ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయలను విరాళాలుగా పొందింది. అయితే ఈ నిధిని ప్రభుత్వ నిధిగా ప్రకటించాలని కోరుతూ సంయక్ గంగ్వాల్ అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒక వేళ అది ప్రభుత్వ నిధి కాకపోతే.. వెబ్‌సైట్ డొమైన్‌లో .gov, ప్రధాని ఫొటో, కేంద్ర ప్రభుత్వ ముద్రను తొలగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు.

కాగా, దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్ ద్వారా వివరణ ఇచ్చింది. ఇది ప్రభుత్వ నిధి కాదని, పీఎం కేర్స్ కింద సేకరించిన విరాళాలు భారత ఖజానాలోకి వెళ్లవని స్పష్టం చేసింది. ఇతర ట్రస్టుల మాదిరిగానే ఈ ట్రస్తుకు వచ్చిన నిధులను వినియోగిస్తామని తెలిపింది.


First Published:  1 Feb 2023 10:31 AM GMT
Next Story