Telugu Global
Telangana

కాంగ్రెస్‌ను వీడనున్న పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి!

కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్ధన్ రెడ్డి ఏకంగా కాంగ్రెస్ పార్టీని వీడుతారనే వార్తలు వస్తున్నాయి.

కాంగ్రెస్‌ను వీడనున్న పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి!
X

తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ కమిటీల సెగ తగ్గేలా కనపడటం లేదు. రెండు రోజుల క్రితం టీపీసీసీకి సంబంధించి పలు కమిటీలు, డీసీసీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఏఐసీసీ ప్రకటించింది. ఎగ్జిక్యూటీవ్ కమిటీ, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ పేరుతో జంబో లిస్టును విడుదల చేసింది. అయినా సరే చాలా మంది కాంగ్రెస్ నేతలు ఈ కమిటీల ఏర్పాటుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో కాకుండా.. ఎగ్జిక్యూటీవ్ కమిటీలో స్థానం కల్పించినందుకు కొండా సురేఖ ఆ పదవికి రాజీనామా చేశారు. సరైన ప్రాధాన్యత దక్కలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ కూడా తన పదవికి రాజీనామా చేశారు.

ఇక కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్ధన్ రెడ్డి ఏకంగా కాంగ్రెస్ పార్టీని వీడుతారనే వార్తలు వస్తున్నాయి. దివంగత నేత పీజేఆర్ కొడుకుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి.. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పని చేశారు. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. రాబోయే ఎన్నికల్లో ఖైరతాబాద్ లేదా జూబ్లీహిల్స్ నుంచి మళ్లీ పోటీ చేయాలని ఆయన భావించారు. కానీ తాజాగా ప్రకటించిన పీసీసీ కమిటీల్లో అతడికి చోటు దక్కలేదు. ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీతో అనుబంధం కొనసాగిస్తున్న తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఆయన గుర్రుగా ఉన్నారు.

పీసీసీ కమిటీల కూర్పుపై ఇప్పటికే బహిరంగంగా తన అసంతృప్తిని వెల్లడించారు. సైకిల్ పార్టీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇచ్చారంటూ రేవంత్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఇప్పటికిప్పుడు పార్టీని వీడే ఆలోచన లేదని.. తమకు గౌరవం ఇవ్వాలని ఆయన కోరారు. అయితే విష్ణువర్ధన్ రెడ్డి పార్టీని వదిలి పోనని పైకి చెబుతున్నా.. తెర వెనుక బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. విష్ణువర్ధన్ రెడ్డి గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. తన సోదరి విజయారెడ్డి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆమె పార్టీలో చేరుతున్నట్లు గానీ, చేరినట్లు గానీ.. విజయారెడ్డి నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి విష్ణుకు ఎలాంటి సమాచారం అందలేదు. అప్పటి నుంచే విష్ణు అసంతృప్తితో ఉన్నారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేయాలని విష్ణు భావించారు. కానీ ఇప్పుడు ఆ టికెట్ విజయారెడ్డికి ఇవ్వాలనే ఆలోచనలో రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు ఆశించిన దగ్గర టికెట్ వస్తుందనే నమ్మకం లేక.. మరోవైపు పీసీసీ కమిటీల్లో తనను పూర్తిగా పక్కన పెట్టడంపై విష్ణు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. గతంలోనే పార్టీకి రాజీనామా చేయాలని భావించగా విష్ణును సీనియర్ నాయకులు బుజ్జగించినట్లు తెలుస్తున్నది.

ఇప్పటికే పార్టీ మార్పు విషయంపై విష్ణు తన అనుచరులు, సన్నిహితులతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ నెల 28న పీజేఆర్ వర్ధంతి ఉన్నది. ఆ రోజు మరోసారి సన్నిహితులతో చర్చలు జరిపి.. ఓ నిర్ణయం తీసుకుంటారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పీజేఆర్ కొడుకుగా నగరంలో విష్ణుకు పలుకుబడి ఉన్నది. ఇప్పటికీ తన తండ్రి అభిమానులు విష్ణు వెంట నడుస్తుంటారు. పార్టీ మారాలని చాలా సార్లు భావించానని.. కానీ తన తండ్రి మెడలోని కండువా చూసి ఆగిపోయానని గతంలో విష్ణు వ్యాఖ్యానించారు. మరి ఇప్పుడు మరోసారి కండువా చూసి ఆగిపోతారా? లేదంటే పార్టీ మారిపోతారా అనేది కొన్ని రోజుల్లో తెలియనున్నది.

First Published:  13 Dec 2022 1:03 AM GMT
Next Story