Telugu Global
Telangana

పాపం షర్మిల.. కాంగ్రెస్ హ్యాండ్ ఇవ్వడంతో.. ఇప్పుడు సరికొత్త ఎత్తుగడ

మీడియా ఇచ్చిన హైప్‌తో పెద్ద పదవే దక్కుతుందని ఆశించిన షర్మిల.. కాంగ్రెస్ వెంట తిరిగారు. కానీ విలీనం లేదు పదవి లేదు అని స్పష్టం కావడంతో ఇప్పుడు పార్టీని పునర్నిర్మించే పనిలో పడ్డారు.

పాపం షర్మిల.. కాంగ్రెస్ హ్యాండ్ ఇవ్వడంతో.. ఇప్పుడు సరికొత్త ఎత్తుగడ
X

వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ అసలు తత్వమేదో మరోసారి బోధపడింది. తండ్రి వైఎస్ఆర్ చనిపోయిన సమయంలోనే కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం మర్చిపోయినట్లు ఉన్నది. అందుకే కొన్నాళ్లుగా కాంగ్రెస్‌లో తాను స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేయాలని భావించారు. కాంగ్రెస్ నాయకులతో మాటలు.. డీకే శివకుమార్‌తో మంతనాలు జరిపారు. ఢిల్లీ, బెంగళూరు అంటూ తిరిగి తిరిగి అలసి పోయారు. చివరకు కాంగ్రెస్ పార్టీ తనను మోసం చేసిందని తెలుసుకున్నారు.

మీడియా ఇచ్చిన హైప్‌తో పెద్ద పదవే దక్కుతుందని ఆశించిన షర్మిల.. కాంగ్రెస్ వెంట తిరిగారు. కానీ విలీనం లేదు పదవి లేదు అని స్పష్టం కావడంతో ఇప్పుడు పార్టీని పునర్నిర్మించే పనిలో పడ్డారు. పార్టీ స్థాపించిన తర్వాత చేసిన సుదీర్ఘ పాదయాత్ర క్రెడిట్ అంతా.. విలీనం పేరుతో చేసిన రాజకీయంతో తుడిచిపెట్టుకొని పోయిందని పార్టీలో చర్చ జరుగుతున్నది. పైగా కాస్తో కూస్తో జనాల్లో తెలిసిన నాయకులు పార్టీని వీడి తమ దారి తాము చూసుకున్నారు. ఏపూరి సోమన్న వంటి ప్రజా గాయకుడు కూడా షర్మిలను వదిలేసి బీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు షర్మిల పార్టీని మళ్లీ మొదటి నుంచి నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కాంగ్రెస్ పార్టీతో విలీనం లేదని తేలిపోవడంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు పార్టీని సన్నద్దం చేయాలని భావిస్తున్నారు. గతంలో వైఎస్ఆర్టీపీలో పని చేసి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో పని చేసిన నాయకులను ఏకం చేసే పనిలో పడ్డారు. చాలా మంది వివిధ కారణాలతో సస్పెన్షన్‌కు గురయ్యారు. వైఎస్ఆర్‌పై ఉన్న అభిమానంతో వాళ్లు పార్టీలో చేరినా.. తర్వాత కొన్ని కారణాల వల్ల షర్మిల సస్పెండ్ చేశారు. ఇప్పుడు అలాంటి నాయకుల సస్పెన్షన్ ఎత్తేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల కో ఆర్డినేటర్లను ఆయా సస్పెన్షన్లు ఎత్తేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తున్నది.

రాబోయే తెలంగాణ ఎన్నికల్లో 119 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని షర్మిల నిర్ణయించారు. కొన్ని నెలలుగా పార్టీలో ఎలాంటి కార్యక్రమాలు జరగకపోవడంతో చాలా మంది నాయకులు సైలెంట్‌గా ఉన్నారు. ఇప్పుడు మరో కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లాలని.. తానే స్వయంగా ఒకటి రెండు చోట్ల నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. పాలేరు, ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే ఎలాం ఉంటుందని కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే జనాలు మర్చిపోయిన వైఎస్ఆర్టీపీని తిరిగి నిర్మించినా.. వైఎస్ షర్మిల చంచల రాజకీయాలు ప్రజలు అంగీకరిస్తారా అనేది అనుమానమే.

First Published:  30 Sep 2023 10:08 AM GMT
Next Story