Telugu Global
Telangana

నిర్మల్ ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుమతి.. ఉత్తర్వులు జారీ చేసిన ఎన్ఎంసీ

నిర్మల్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం గతేడాది ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు మౌలిక వసతుల కల్పనకు నిధులు కూడా విడుదల చేసింది.

నిర్మల్ ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుమతి.. ఉత్తర్వులు జారీ చేసిన ఎన్ఎంసీ
X

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న మరో మెడికల్ కాలేజీకి అనుమతి లభించింది. ఆరోగ్య తెలంగాణ సాధించే దిశగా రాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రతీ జిల్లాలో వైద్యారోగ్య శాఖ మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు నడుంభిగించింది. ఈ క్రమంలో నిర్మాల్ జిల్లాలో మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరం నుంచి 100 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కాలేజీలో ప్రవేశాలు ఎన్ఎంసీ ఇచ్చే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని పేర్కొన్నది.

నిర్మల్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం గతేడాది ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు మౌలిక వసతుల కల్పనకు నిధులు కూడా విడుదల చేసింది. కళాశాల, ఆసుపత్రి కోసం శరవేగంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ఎన్ఎంసీ నుంచి ప్రాథమిక అనుమతులు లభించడంతో నిర్మల్ జిల్లా వాసుల కల నెరవేరినట్లు అయ్యింది. నిర్మల్ కాలేజీకి అనుమతులు రావడంతో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కాలేజీ మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావుకు ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.

నిర్మల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి సంబంధించి మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డు (ఎంఏఆర్బీ) ఈ ఏడాది ఏప్రిల్‌లో తనిఖీలు నిర్వహించింది. అక్కడ ఏర్పాటు చేస్తున్న కాలేజీ, ల్యాబ్స్, లైబ్రరీ, హాస్టల్, హాస్పిటల్, బోధనా సిబ్బంది, రెసిడెంట్ ట్యూటర్స్, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది వంటి అంశాలను తనిఖీ చేశారు. నిర్మల్ మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేస్తున్న వసతులపై సంతృప్తి చెందిన ఎంఏఆర్బీ.. ప్రాథమిక రిపోర్టును ఏప్రిల్ 17న నేషనల్ మెడికల్ కమిషన్‌కు సమర్పించింది. దీంతో ఎన్ఎంసీ కాలేజీకి అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కు అనుబంధంగా నిర్మల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నిర్వహించడానికి ప్రాథమిక అనుమతులు ఇస్తున్నామని ఎన్ఎంసీ పేర్కొంది. ఈ విద్యా సంవత్సరం నుంచి 100 ఎంబీబీఎస్ సీట్లకు ఓకే చెప్పింది. నిర్ణీత సమయంలోగా అన్ని మౌలిక వసతులు పూర్తి చేయాలని, తనిఖీల సందర్భంగా అధికారుల బృందం చూపించిన లోటుపాట్లను సరిదిద్దాలని కోరింది. ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బందిని నియమించాలని.. భవనాలు, హస్పిటల్ సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది.


First Published:  12 May 2023 10:45 AM GMT
Next Story