Telugu Global
Telangana

ప్రజలే కేంద్రంగా సాగిన తెలంగాణ సంస్కరణలు.. యావత్ దేశానికే పరిపాలనా పాఠం : మంత్రి కేటీఆర్

సంక్షేమ ఫలాలే కాకుండా, సంస్కరణ ఫలాలు కూడా ప్రజలందరికీ అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కి మాత్రమే సొంతమని తెలిపారు.

ప్రజలే కేంద్రంగా సాగిన తెలంగాణ సంస్కరణలు.. యావత్ దేశానికే పరిపాలనా పాఠం : మంత్రి కేటీఆర్
X

ప్రజలే కేంద్రంగా సాగిన తెలంగాణ సంస్కరణల పథం.. యావత్ భారతావనికే ఒక పరిపాలనా పాఠం. ప్రతీ నిర్ణయంలో పారదర్శకత, ప్రతీ మలుపులో జవాబుదారితనం, ప్రతీ అడుగులో ప్రజల భాగస్వామ్యం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు (జూన్ 10) సుపరిపాలనా దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో తీసుకొని వచ్చిన సంస్కరణలను ప్రస్తావిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

స్వపరిపాలనా ఫలాలనే కాదు.. సుపరిపాలనా సౌరభాలను సమాజంలోని ప్రతి వర్గానికి తెలంగాణ ప్రభుత్వం సగర్వంగా అందిస్తోంది. తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రస్థానంలోఎన్నో చారిత్రక నిర్ణయాలు, మరెన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొని రాబడ్డాయని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఈ దశాబ్ద కాలంలో చేపట్టిన పాలనా సంస్కరణలు.. వచ్చే శతాబ్దికీ అనుచరించాల్సిన అడుగు జాడలని కేటీఆర్ చెప్పారు.

సంక్షేమ ఫలాలే కాకుండా, సంస్కరణ ఫలాలు కూడా ప్రజలందరికీ అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కి మాత్రమే సొంతమని తెలిపారు. మీకు పాలన చేతకాదు అన్నోళ్లే.. మన పాలనా సంస్కరణలు చూసి మనసారా మెచ్చుకుంటున్న అరుదైన తరుణం ఇది. తమ గుండెల నిండా తెలంగాణను దీవిస్తున్న అపూర్వ సందర్భం ఇదని కేటీఆర్ పేర్కొన్నారు.

విద్యుత్ దీపాలతోనే కాదు.. విద్యతో కూడా ప్రతీ ఇంటిలో వెలుగులు నింపొచ్చని కేసీఆర్ నిరూపించారు. విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొని వచ్చి.. విద్యారంగాన్ని తీర్చి దిద్దే వినూత్న ఆలోచనలు చేసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని చెప్పారు.

పంచాయతీరాజ్ శాఖలో కూడా వెలుగులు తెచ్చారని.. దీంతో పల్లెలు ప్రగతిరథ చక్రాల్లా మారిపోయాయని అన్నారు. మున్సిపల్ శాఖలో అవినీతి మురికిని కడిగిపారేసిన సంస్కరణల పథం.. దేశంలోని సరికొత్త అధ్యాయానికి నాంది పలికిందని కేటీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.


బాబాసాహెబ్ చూపిన బాటలో మన తెలంగాణ.. మనం తెచ్చుకున్నం. సుపరిపాలనలో స్పీడ్ పెంచేందుకు.. నూతన సచివాలయాన్ని కట్టుకున్నం. డా.బీ.ఆర్.అంబేడ్కర్ పేరును సగర్వంగా పెట్టుకున్నం. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించుకున్నామని అన్నారు. సమున్నత విజ్ఞానమూర్తిని గుండెలనిండా గౌరవించుకోవడమే కాకుండా.. ఆయన ఆశయాలే స్ఫూర్తిగా.. సమగ్ర.. సమీకృత.. సమ్మిళిత.. సమతుల్య అభివృద్దే ఆలంబనగా తొమ్మిదేళ్ల పాటు సుపరిపాలన సాగించాము. గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకూ ఈ ప్రస్థానంలో భాగస్వామ్యులైన ఉద్యోగులకు, యావత్ ప్రభుత్వ యంత్రాంగానికి సుపరిపాలన సైనికులందరికి పేరు పేరునా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మంత్రి కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.


First Published:  10 Jun 2023 5:22 AM GMT
Next Story