Telugu Global
Telangana

సీడబ్ల్యూసీలో తెలంగాణకు చోటు దక్కేనా? రేపు హైదరాబాద్‌లో కీలక సమావేశం!

ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ 85వ ప్లీనరీ నిర్వహించనున్నారు. ప్లీనరీలో ఓటింగ్ లేదా నామినేషన్ పద్దతిలో సీడబ్ల్యూసీ సభ్యులను ఎన్నుకోనున్నారు.

సీడబ్ల్యూసీలో తెలంగాణకు చోటు దక్కేనా? రేపు హైదరాబాద్‌లో కీలక సమావేశం!
X

ఏఐసీసీ స్టీరింగ్ కమిటీలో గత కొంత కాలంగా తెలంగాణకు చెందిన నాయకుడికి చోటు లేదు. తెలుగు రాష్ట్రాలకు కలిపి టి. సుబ్బరామిరెడ్డి మాత్రమే స్టీరింగ్ కమిటీలో ఉన్నారు. అయితే, ఆయన ఏపీకి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో తెలంగాణకు అసలు చోటే లేకుండా పోయింది. గతంలో కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత నిర్ణయాత్మక అధికారాలు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)కి ఉండేవి. అయితే, గతేడాది కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక సందర్భంగా అప్పటి వరకు ఉన్న సీడబ్లూసీని ఏఐసీసీ స్టీరింగ్ కమిటీగా మార్చారు. ఈ సారి ప్లీనరీలో సీడబ్ల్యూసీని పునరుద్దరించనున్నారు.

ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ 85వ ప్లీనరీ నిర్వహించనున్నారు. ప్లీనరీలో ఓటింగ్ లేదా నామినేషన్ పద్దతిలో సీడబ్ల్యూసీ సభ్యులను ఎన్నుకోనున్నారు. అయితే, ఈ సారి కనీసం ఒకరికైనా తెలంగాణ నుంచి ఎన్నుకుంటారనే చర్చ జరుగుతోంది. గతంలో సీడబ్ల్యూసీలో 48 మంది సభ్యులు ఉండేవారు. ఏఐసీసీ స్టీరింగ్ కమిటీ నుంచే ఎక్కువ మంది సీడబ్ల్యూసీకి నామినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, కొత్త వారిని మాత్రం ఓటింగ్ ద్వారా ఎన్నుకునే అవకాశం ఉన్నది.

కాగా, సీడబ్ల్యూసీకి ఈ సారి రాష్ట్రం నుంచి ఒక సీనియర్ నాయకుడికి చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య లేదా వి. హనుమంతరావు పేర్లు వినిపిస్తున్నా.. పొన్నాలకే ఎక్కువ అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతున్నది.

రాయ్‌పూర్‌లో జరుగనున్న ప్లీనరీకి ముందు ఈ నెల 20 (సోమవారం) హైదరాబాద్‌లో ప్రిలిమినరీ మీటింగ్ జరుగనున్నది. తెలంగాణకు చెందిన 240 మంది పీసీసీ డెలిగేట్లు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ప్లీనరీకి హాజరయ్యే 30 మంది ఏఐసీసీ మెంబర్లను ఎన్నుకోనున్నారు. ప్రతీ 8 మంది పీసీ డెలిగేట్లు ఒక ఏఐసీసీ ప్రతినిధిని ఎన్నుకోనున్నట్లు తెలుస్తున్నది.

రేపటి సమావేశంలో ఎన్నుకోబడిన ఏఐసీసీ సభ్యుల లిస్టును రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రేకు అందజేస్తారు. ఆయన ఒక తీర్మానం ద్వారా ఆ లిస్టును ఆమోదించనున్నట్లు టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జి. నిరంజన్ తెలిపారు.

First Published:  19 Feb 2023 4:15 AM GMT
Next Story