Telugu Global
Telangana

రేవంత్ ఇంత అమాయకుడా?

స్టీఫెన్ సన్‌కు రేవంత్ డబ్బులిస్తున్న వీడియో, ఆడియో దృశ్యాలన్నీ అబద్ధాలేనా? రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన తర్వాత, సాక్ష్యాలను పరిశీలించిన తర్వాతే కదా హైకోర్టు రేవంత్‌ను రిమాండుకు పంపింది. జనాలకు వాస్తవాలు తెలీదని, ఏం చెప్పినా నమ్మేస్తారనే భ్రమల్లో రేవంత్ ఉన్నట్లున్నారు.

రేవంత్ ఇంత అమాయకుడా?
X

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యలు చాలా విచిత్రంగా ఉన్నాయి. తనను కేసీఆర్‌ సర్కార్ అన్యాయంగా జైల్లో పెట్టించినందుకే ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఇంటికి సీబీఐ వచ్చిందన్నారు. తనను 2015లో అన్యాయంగా జైల్లో పెట్టారని చివరకు తనబిడ్డ లగ్నపత్రికకు కూడా వెళ్ళనీయకుండా అడ్డుకున్నట్లు మండిపడ్డారు. అన్యాయంగా కేసులో ఇరికించి, జైలుకు పంపినప్పుడు తాను పడ్డ నొప్పి ఇప్పుడు కేసీఆర్‌కు కూడా తెలుస్తోందని రేవంత్ చెప్పటమే విచిత్రంగా ఉంది.

రేవంత్‌ను ఎవరూ అన్యాయంగా కేసుల్లో ఇరికించలేదు. రేవంత్‌పై ఎవరు తప్పుడు కేసులు పెట్టలేదు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రలో చంద్రబాబు నాయుడు సూత్రదారి అయితే రేవంత్ పాత్రదారని కేసీఆర్‌ చేసిన ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటు కొనుగోలుకు రూ. 5 కోట్లకు బేరం కుదుర్చుకున్నదెవరు? బేరంలో రూ. 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేందుకు నేరుగా స్టీఫెన్ సన్ ఇంటికి వెళ్ళినప్పుడే రేవంత్ డబ్బుతో పట్టుబడ్డారు. బేరం కుదుర్చుకోవటం, అడ్వాన్స్ చెల్లించటం వాస్తవం కాదా ?

తన ప్రభుత్వాన్ని కూల్చుకోవటానికి కేసీఆర్‌ కుట్ర చేసుకుంటారా? జరిగిన కుట్ర, చేసిన ప్రయత్నం కళ్ళముందు కనిపించిన తర్వాతే రేవంత్‌ను తెలంగాణ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆ కేసే దేశంలో 'ఓటుకు నోటు' కేసుగా సంచలనమైంది. అంతటి సంచలన కేసులో కీలకపాత్ర పోషించిన రేవంత్ ఇప్పుడు తనను అన్యాయంగా ఇరికించారని, అరెస్టు చేశారని చెప్పటమే చాలా ఆశ్చర్యంగా ఉంది.

స్టీఫెన్ సన్‌కు రేవంత్ డబ్బులిస్తున్న వీడియో, ఆడియో దృశ్యాలన్నీ అబద్ధాలేనా? రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన తర్వాత, సాక్ష్యాలను పరిశీలించిన తర్వాతే కదా హైకోర్టు రేవంత్‌ను రిమాండుకు పంపింది. జనాలకు వాస్తవాలు తెలీదని, ఏం చెప్పినా నమ్మేస్తారనే భ్రమల్లో రేవంత్ ఉన్నట్లున్నారు. కానీ రేవంత్ అనుకున్నట్లుగా ఓటుకు నోటు కేసును జనాలు అంత తొందరగా మరచిపోయే అవకాశమే లేదన్న విష‌యాన్ని మరచిపోయినట్లున్నారు.

First Published:  6 Dec 2022 6:32 AM GMT
Next Story