Telugu Global
Telangana

బీసీ సభలో ప్రసంగం అప్పజెప్పిన పవన్

బీసీ సభలో పవన్ తూతూమంత్రంగా తన ప్రసంగాన్ని ముగించారు. మోదీ భజన చేశారే కానీ, తెలంగాణ రాజకీయాలను, బీసీల సమస్యలను ప్రస్తావించలేకపోయారు. కనీసం వైరి వర్గాలపై పల్లెత్తు మాట అనే ధైర్యం కూడా పవన్ చేయలేదు.

బీసీ సభలో ప్రసంగం అప్పజెప్పిన పవన్
X

చాలా రోజుల తర్వాత తెలంగాణలో పవన్ కల్యాణ్ ప్రసంగం, అందులోనూ పక్కన ప్రధాని మోదీ, బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ.. జనసేనాని ఎలా మాట్లాడతారో అని ఎదురు చూసిన అభిమానులు పూర్తిగా నిరాశపడ్డారు. ఏపీలో వారాహి యాత్రల్లో పవన్ ప్రసంగాలకు, తెలంగాణలో పవన్ మాటలకు అస్సలు ఎక్కడా పొంతన లేదు. పూర్తిగా పేపర్ చూసి చదివారు, అది కూడా తడబడుతూ, ఇబ్బంది పడుతూ, మొక్కుబడిగా మోదీని పదే పదే పొగుడుతూ తన ప్రసంగం ముగించారు.


బీసీ సభలో కాపు నాయకుడు పవన్ కల్యాణ్ ఏంటి, ప్రత్యేకంగా పవన్ ప్రసంగం ఏంటి.. అని చాలామందికి అనుమానం ఉంది. కానీ జనసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ.. ఈ సభలో మోదీ పక్కన ఆయన్ను కూర్చోబెట్టి తెలంగాణలో పవన్ అభిమానుల ఓట్లు సంపాదించాలని అనుకుంది. అందుకే సందర్భం లేకపోయినా ఈ సభకు ఆయన్ను ఆహ్వానించింది. ఇక బీసీ సభలో పవన్ కూడా తూతూమంత్రంగా తన ప్రసంగాన్ని ముగించారు. మోదీ భజన చేశారే కానీ, తెలంగాణ రాజకీయాలను, బీసీల సమస్యలను ప్రస్తావించలేకపోయారు. కనీసం వైరి వర్గాలపై పల్లెత్తు మాట అనే ధైర్యం కూడా పవన్ చేయలేదు.

నీళ్లు, నిధులు, నియామకాలకోసం పోరాడి తెలంగాణ సాధించుకున్నామని, కానీ ఇప్పటికీ ఆ దిశగా ముందడుగు పడలేదని చెప్పారు పవన్. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలని, ఐదేళ్ల పాటు ఎన్నికలే ధ్యేయంగా ఉండొద్దని సూచించారు. ఎన్నికలే ధ్యేయంగా పనిచేసి ఉంటే 317 ఆర్టికల్, మహిళా రిజర్వేషన్ బిల్లు, ట్రిపుల్ తలాక్, అయోధ్య రామ మందిరం నిర్మాణం ఇవన్నీ మోదీ చేసేవారా అని ప్రశ్నించారు. దేశ అభివృద్ధికి అంతర్గత భద్రత చాలా ముఖ్యమని, మన దేశంపై దాడి చేస్తే తిరిగి దాడి చేయగలమని మోదీ నిరూపించారని.. అందుకే మోదీ అంటే తనకు అభిమానం అని చెప్పారు పవన్. బీసీని ముఖ్యమంత్రిని ప్రకటించిన బీజేపీకి జనసేన నుంచి పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. తెలంగాణలో కలిసి పోటీ చేసే అవకాశం ఇచ్చిన బీజేపీకి కృతజ్ఞతలు చెప్పారు జనసేనాని.

First Published:  7 Nov 2023 2:02 PM GMT
Next Story