Telugu Global
Telangana

కుక్కనోట్లో మూతి పెట్టినట్టు.. స్రవంతి ఘాటు వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో చర్చ

మిగతా వారి విషయంలో అధిష్టానం లైట్ తీసుకోవచ్చు కానీ, మునుగోడులో స్రవంతి ఆగ్రహంపై మాత్రం పార్టీలో చర్చ జరుగుతోంది.

కుక్కనోట్లో మూతి పెట్టినట్టు.. స్రవంతి ఘాటు వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో చర్చ
X

తెలంగాణ అసెంబ్లీ టికెట్ల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీలో చాలామందికి అన్యాయం జరిగిందనే విషయం తెలిసిందే. అయితే మునుగోడు విషయంలో పాల్వాయి స్రవంతికి టికెట్ రాకపోవడం, ఆ స్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఏడాది క్రితం జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో దిగారు స్రవంతి. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో.. కాంగ్రెస్ కు ఆమె అవసరం కనిపించింది. ఇప్పుడు ఆమె అవసరం తీరిపోయాక పక్కనపెట్టారు, పైగా పార్టీని కాదని బయటకు వెళ్లిన రాజగోపాల్ రెడ్డికి అదే స్థానంలో టికెట్ ఇచ్చారు. దీంతో స్రవంతి రగిలిపోతున్నారు. అధిష్టానంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

"మాపై తప్పుగా ఒర్లుతున్నరు.. తిప్పి నాలుగు సరుద్దామంటే పార్టీ గుర్తుకొస్తున్నది. పైసల మూటలు మోసుకొచ్చిండని, ఎదుటి వ్యక్తి ఎలాంటోడో తెలియకుండా కుక్క నోట్లో మూతి పెట్టినట్లే టికెటిచ్చిండ్రు. ఉల్టా మమ్మల్ని ఎంగిలి మెతుకులకు ఆశపడ్డరని అంటున్నరు. ఆ మాటలనేముందు అందులో అర్థమేందో తెల్సుకోవాలె. రాజకీయాలకు కొత్తగొచ్చి పార్టీ టికెట్లు కొనుక్కునేటోళ్లు మాట్లాడే మాటలవి. మీరు ధనబలంతోనే రాజకీయం చేస్తమంటే మేము అంగీకరించే పరిస్థితుల్లో లేము. చెప్పడం తెలుసు, చెప్పుతో కొట్టడమూ మాకు తెలుసు." అంటూ తన బాధను వ్యక్తం చేశారు స్రవంతి.

మిగతా వారి విషయంలో అధిష్టానం లైట్ తీసుకోవచ్చు కానీ, మునుగోడులో స్రవంతి ఆగ్రహంపై మాత్రం పార్టీలో చర్చ జరుగుతోంది. ఆడబిడ్డ కంటతడి మునుగోడులో పార్టీకి మంచిది కాదంటున్నారు. అందులోనూ ఏడాది క్రితం ఆమెకు ఇచ్చిన మాటను పార్టీ తప్పినట్టేనని చెబుతున్నారు. ఆమెను బుజ్జగించి పార్టీ ప్రచారానికి తీసుకు రావాలని అధిష్టానం ఆలోచిస్తోంది. మరి స్రవంతి కరిగిపోతారా, పార్టీ ప్రకటించిన అభ్యర్థికి మద్దతు తెలిపి ప్రచారానికి వస్తారా అనేది వేచి చూడాలి.

First Published:  29 Oct 2023 7:03 AM GMT
Next Story