Telugu Global
Telangana

పద్మ నా బిడ్డ.. ఆమె అడిగితే నేను చేయనా? .. మెదక్ సభలో సీఎం కేసీఆర్

మెదక్‌ను జిల్లా కేంద్రంగా చేసుకున్నాము. ఇక రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలనే మీ కోరికను మన్నిస్తున్నాము. రెండు రోజుల్లోనే దీనికి సంబంధించిన జీవో వెలువడుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు.

పద్మ నా బిడ్డ.. ఆమె అడిగితే నేను చేయనా? .. మెదక్ సభలో సీఎం కేసీఆర్
X

పద్మా దేవేందర్ రెడ్డి నా బిడ్డ.. ఆమె అడిగితే నేను చేయకుండా ఉంటానా? ఉద్యమ కాలం నుంచి నా వెంట ఉన్నది. ఆమెను మీరు గెలిపించుకోబట్టే ఈనాడు అద్భుతమైన కలెక్టరేట్ , ఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ వస్తదో రాదో అనుకున్న సమయంలో తను ఉద్యమంలో పాల్గొన్నది. జెడ్పీటీసీ నుంచి డిప్యూటీ స్పీకర్‌గా ఎదిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. మెదక్ జిల్లాలో బుధవారం సీఎం కేసీఆర్ పర్యటించి కలెక్టరేట్, ఎస్పీ, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మెదక్ సీఎస్ఐ చర్చి కాంపౌండ్ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రగతి శంఖారావం సభలో మాట్లాడుతూ..

మెదక్‌ను జిల్లా కేంద్రంగా చేసుకున్నాము. ఇక రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలనే మీ కోరికను మన్నిస్తున్నాము. రెండు రోజుల్లోనే దీనికి సంబంధించిన జీవో వెలువడుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. జిల్లాలోని గణపురం ఆయకట్టుకు గతంలో ఏనాడూ నీళ్లు రాలేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్లీ ఒక్క ఛాన్స్ ఇవ్వండని అడుగుతున్నారు. 50 ఏళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉన్నది. కానీ గణపురానికి నీళ్లు కావాలంటే మెదక్ ఆర్డీవో ఆఫీసు వద్ద ధర్నా చేయాల్సిన పరిస్థితి ఉండేదని కేసీఆర్ అన్నారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత నేను సీఎం అయ్యాను. ఆ సమయంలో పద్మ దేవేందర్ రెడ్డి సర్వే చేసి.. గణపురం ఎత్తు పెంచుకున్నామని చెప్పారు. కాల్వలు బాగు చేసుకున్న తర్వాత 30 వేల నుంచి 40 వేల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నట్లు సీఎం చెప్పారు. గత కాంగ్రెస్ నాయకులు సింగూరు ప్రాజెక్టును హైదరాబాద్ మంచి నీటి కోసం దత్తత ఇచ్చి.. ఇక్కడి మన పొలాలను ఎండబెట్టారు. కానీ ఈ రోజు సింగూరును మొత్తం మెదక్ జిల్లాకే అంకితం చేసుకున్నాము. అందుకే ఈనాడు జోగిపేట ప్రాంతంలో నిళ్లు పారుతున్నాయి. గణపురం ఆయకట్టు కింద ఒక్క గుంట కూడా ఎండిపోకుండా పంటలు పండించుకుంటున్నామని సీఎం చెప్పారు.

త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల సమయం రాగానే వడ్ల కల్లాల వద్దకు అడుక్కొని తినే వాళ్లు వచ్చినట్లు చాలా మంది బయలు దేరుతారు. కాబట్టి ఇలాంటి ఎన్నికల సమయంలో ఆగమాగం కావొద్దు. ఎలక్షన్లు వచ్చిన సమయంలోనే ప్రజలు తమ ధీరత్వాన్ని ప్రదర్శించాలని సీఎం కేసీఆర్ కోరారు. నిజాలు ఏమిటి.. వాస్తవం ఏంటి.. ఎవరు ఏం మాట్లాడుతున్నారో ప్రజలు గమనించాలి. నిజమైన ప్రజా సేవకులను గుర్తించినట్లు అయితే.. బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయని కేసీఆర్ చెప్పారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతును ఎలా అయినా బాగు చేయాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలు మొదలు పెట్టాము. కాళేశ్వరం పూర్తి చేసి నీళ్లు ఇస్తున్నాము. ఇంకా అనేక రకాలైన సమస్యలు పరిష్కారం చేసుకున్నాము. రైతు బంధు, రైతు బీమా అమలు చేస్తున్నాము. పంటలకు 24 గంటల కరెంటు ఇస్తున్నాము. కానీ బీజేపీ, కాంగ్రెస్ మాత్రం రైతులను మోసం చేసే పనులు చేస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం బావి దగ్గర మోటార్లు పెట్టాలని అంటుంటే.. కాంగ్రెస్ మాత్రం మూడు గంటల కరెంట్ చాలని అంటోంది. బావి దగ్గర మీటర్లు పెట్టకపోవడం వల్ల కేంద్రం మనకు రూ.27 వేల కోట్ల నష్టం కలిగించిందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇక కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ కేవలం 7 గంటల కరెంట్ మాత్రమే ఇస్తోంది. ఇప్పుడు తెలంగాణలో ఛాన్స్ ఇవ్వమని కోరుతోందని అన్నారు.

తెలంగాణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇక్కడ కరెంటు, నీళ్లు ఉచితంగా లభిస్తుండటంతో మూడు పంటలు పండించుకుంటున్నారు. మెదక్‌లో పారుతున్న హల్దీ వాగు, మంజీరా నదులపై దాదాపు 30 నుంచి 40 చెక్ డ్యాములు నిర్మించాము. దీంతో ఆయా నదులు ఏడాదంతా సజీవంగా ఉండేలా చూసుకున్నామని కేసీఆర్ అన్నారు. కాళేశ్వరంలో భాగంగా మల్లన్నసాగర్ ద్వారా అవసరమైన వాగుల్లోకి నీళ్లు విడుదల చేస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు.

First Published:  23 Aug 2023 1:45 PM GMT
Next Story