Telugu Global
Telangana

ముదిరాజ్ వివాదానికి ముగింపు.. సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్‌ సామాజిక వర్గానికి నిజానిజాలు తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అందుకే విచారణకు సిద్ధమవుతున్నానని, ఆ ఆడియో ఫేక్ అని తేల్చే వరకు ఊరుకోనన్నారు కౌశిక్ రెడ్డి.

ముదిరాజ్ వివాదానికి ముగింపు.. సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి
X

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సోదరులకు క్షమాపణలు చెప్పారు. తన తప్పు లేకపోయినా, ఫేక్ ఆడియో వల్ల కలిగిన అపార్థాలకు తాను సారీ చెబుతున్నట్టు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ వర్గాలకు అండగా నిలబడుతుందని, బీఆర్ఎస్ లోని నాయకులందరికీ బీసీలంటే గౌరవం ఉందని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ముదిరాజ్ లంటే తనకు ఎంతో అభిమానమని, అలాంటి వర్గాన్ని తాను కించపరిచేలా మాట్లాడాననడం సరికాదన్నారు. ఫేక్ ఆడియో పై తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేస్తానని, దానిని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపాలని కోరతానని చెప్పారు.

అసలేం జరిగింది..?

ముదిరాజ్ వర్గానికి చెందిన ఓ కెమెరామెన్ ని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కిడ్నాప్ చేశారని, ముదిరాజ్ లపై అనుచితంగా మాట్లాడారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజ్ వర్గం నేతలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అయితే సదరు కెమెరామెన్, కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లాడని, ఆయన వర్గం మరో వీడియో బయట పెట్టింది. ఈ క్రమంలో ముదిరాజ్ లను కించపరిచేలా ఉన్న ఆడియో వైరల్ గా మారింది. అయితే ఆ గొంతు తనది కాదని, అది ఫేక్ ఆడియో అంటూ కౌశిక్ రెడ్డి చెబుతూ వచ్చారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కిడ్నాప్ వ్యవహారంపై పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు, తన దగ్గర ఉన్న వీడియో సాక్ష్యాలను కూడా సమర్పించారు.

ఈ క్రమంలో ఈ వివాదానికి వెంటనే ముగింపు పలకాలనే ఉద్దేశంతో కౌశిక్ రెడ్డి, ముదిరాజ్ వర్గానికి క్షమాపణలు చెప్పారు. ఫేక్‌ ఆడియోతో ముదిరాజ్‌ల మనోభావాలు దెబ్బతింటే, ప్రత్యేకించి హుజూరాబాద్‌ నియోజకవర్గ ముదిరాజ్‌ సోదరులను క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్‌ సామాజిక వర్గానికి నిజానిజాలు తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అందుకే విచారణకు సిద్ధమవుతున్నానని, ఆ ఆడియో ఫేక్ అని తేల్చే వరకు ఊరుకోనన్నారు కౌశిక్ రెడ్డి.

First Published:  27 Jun 2023 12:59 AM GMT
Next Story