Telugu Global
Telangana

రాజగోపాల్‌పై బలమైన ముద్ర పడిపోయిందా?

వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్‌ కోసమే రాజగోపాల్ ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి ఉపఎన్నికకు కారణమయ్యాడని జనాల్లో బాగా జీర్ణించుకుపోయింది. రాజగోపాల్ మీద ఈ ముద్ర వేయటంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండు కూడా సక్సెస్ అయ్యాయి.

రాజగోపాల్‌పై బలమైన ముద్ర పడిపోయిందా?
X

మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో గెలుపు కోసం మూడు ప్రధాన పార్టీల అభ్యర్ధులు పెద్ద పోరాటమే చేస్తున్నారు. గెలుపోటములు ఎవరిదనే విషయం ఇప్పుడు చెప్పలేం. అయితే అభ్యర్ధులకున్న వ్యక్తిగత ఇమేజ్‌ ఏమిటనేది కూడా ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది. ఇమేజ్‌ పరంగా తీసుకుంటే బాగా గబ్బుపట్టిపోయింది మాత్రం బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అనే చెప్పాలి. అందరు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ప్యాకేజీ స్టార్ అని అంటారు. అయితే ఆ ప్యాకేజీ వివరాలు ఎవరికీ ఎప్పటికీ తెలిసే అవకాశం లేదు.

కానీ తెలంగాణలో మాత్రం కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మీద చాలా బలంగా రూ.18 వేల కోట్ల ప్యాకేజీ ముద్ర పడిపోయింది. వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్‌ కోసమే రాజగోపాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రాజీనామాచేసి ఉపఎన్నికకు కారణమయ్యాడని జనాల్లో బాగా జీర్ణించుకుపోయింది. రాజగోపాల్ మీద ఈ ముద్ర వేయటంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండు కూడా సక్సెస్ అయ్యాయి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఆ ముద్రను స్వయంగా బీజేపీ అభ్యర్ధే అంగీకరించటం.

ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన కొత్తల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఆరోపణను నిరూపించమని రాజగోపాల్ చాలెంజ్ చేశారు. అయితే రోజులు గడిచే కొద్దీ ఆ విషయంలో క్లారిటి వచ్చేసింది. దాంతో ఇక బుకాయించి లాభం లేదని అర్ధమైపోయిన రాజగోపాల్ తనకు బొగ్గు కాంట్రాక్టు వచ్చింది నిజమే అని అంగీకారించాల్సి వ‌చ్చింది.

దాంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ చెబుతున్న రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు నిజమే అని ఆధారాలతో సహా జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది. తన స్వార్ధం కోసమే రాజగోపాల్ ఉపఎన్నికను తెచ్చారనే రేవంత్, కేటీఆర్‌ ఆరోపణలు నిజమే అని జనాలు నమ్ముతున్నారు. మొత్తం మీద పవన్ మీద పడిన ముద్ర ఎలాగున్నా రాజగోపాల్ మీద పడిన ముద్ర నిజమైపోయింది. రేపటి ఎన్నికల్లో రాజగోపాల్ గెలుస్తారో లేదే తెలీదుకానీ ఆయన మీద రూ.18 వేల కోట్ల ప్యాకేజీ లీడర్ అనేది మాత్రం స్ధిరపడిపోయిందనే చెప్పాలి.

First Published:  19 Oct 2022 11:39 AM GMT
Next Story