Telugu Global
Telangana

ఓవర్సీస్ స్కాలర్ షిప్.. విద్యార్థికి మద్దతుగా కేటీఆర్ ట్వీట్

నిత్యం సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆయా సమస్యలపై స్పందించడంలో కేటీఆర్ ముందుంటారు. అందుకే సదరు విద్యార్థి కేటీఆర్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

ఓవర్సీస్ స్కాలర్ షిప్.. విద్యార్థికి మద్దతుగా కేటీఆర్ ట్వీట్
X

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం సజావుగా అమలైంది. విదేశాల్లో విద్యాభ్యాసం చేసేందుకు వెళ్లిన పేద ప్రతిభావంతులు ఈ స్కాలర్ షిప్ ద్వారా లబ్ధిపొందారు. తెలంగాణలో అధికారం మారిన తర్వాత, రెండో విడత స్కాలర్ షిప్ నిధులు ఇంకా విడుదల కాలేదు. దీంతో కొంతమంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా ఓ విద్యార్థి కేటీఆర్ దృష్టికి తన సమస్యను తీసుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే స్పందించారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు ట్విట్టర్లోనే ఈ సమస్యను విన్నవించారు.

అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థి తన సమస్యను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. గతేడాది స్కాలర్ షిప్ పొందానని, ఈ ఏడాది రెండో విడత ఇంకా విడుదల కాలేదంటూ ట్వీట్ చేసి, కేటీఆర్ ని ట్యాగ్ చేశారు. దీంతో స్పందించిన కేటీఆర్, భట్టి విక్రమార్కకు ట్విట్టర్ వేదికగా విన్నవించారు. కేసీఆర్ హయాంలో 7వేలమంది విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్ షిప్ లు అందాయని రెండో విడత వెంటనే విడుదల చేసి విద్యార్థులకు అండగా నిలవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు కేటీఆర్.

వాస్తవానికి ప్రజలు ఆయా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. కానీ నిత్యం సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆయా సమస్యలపై స్పందించడంలో కేటీఆర్ ముందుంటారు. అందుకే సదరు విద్యార్థి కేటీఆర్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. తమ సమస్యను కేటీఆర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగలిగారు. అధికారంలో లేకపోయినా కూడా ప్రజా సమస్యలపై స్పందించడంలో బీఆర్ఎస్ నేతలు ముందున్నారని నెటిజన్లు అభినందిస్తున్నారు.

First Published:  29 Feb 2024 5:27 AM GMT
Next Story