Telugu Global
Telangana

'మునుగోడు ఎన్నికల్లో రూ.627 కోట్లు ఖర్చు....ఓటుకు రూ.9 వేలు'

మునుగోడు ఉపఎన్నికపై 'ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్' సంస్థ ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసింది. 75% మంది ఓటర్లకు ఒక్కో ఓటుకు 9,000 చొప్పున డబ్బు చెల్లించారని, అక్కడ పారిన‌ మద్యం విలువ 300 కోట్లు ఉంటుందని, ఒక్కో ర్యాలీకి 2.5 కోట్ల చొప్పున 50 ర్యాలీలకు, సమావేశాలకు 125 కోట్లు ఖర్చు ఆయ్యిందని ఆ సంస్థ ఆరోపించింది. .

మునుగోడు ఎన్నికల్లో రూ.627 కోట్లు ఖర్చు....ఓటుకు రూ.9 వేలు
X

మునుగోడు ఉప ఎన్నిక పెద్ద యుద్దాన్ని తలపించింది. ఆర్థిక, మానవ వనరులు విచలవిడిగా వినియోగించారు. ఈ ఒక్క ఎన్నికకే 627 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ FGG సంస్థ ఆరోపించింది. ఈ మేరకు సంస్థ ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసింది.

75% మంది ఓటర్లకు ఒక్కో ఓటుకు 9,000 చొప్పున డబ్బు చెల్లించారని, ఆ మొత్తం 152 కోట్లు ఉంటుందని FGG కార్యదర్శి ఎం పద్మనాభ రెడ్డి ఆరోపించారు. "అక్కడ పారిన‌ మద్యం విలువ 300 కోట్లు ఉంటుంది. ఒక్కో ర్యాలీకి 2.5 కోట్ల చొప్పున 50 ర్యాలీలకు, సమావేశాలకు 125 కోట్లు ఖర్చు ఆయ్యింది." అని పద్మనాభ రెడ్డి తెలిపారు.

ర్యాలీలు, సమావేశాల సమయంలో, రాజకీయ పార్టీలు ప్రజలను సమీకరించడానికి ఒక్కొక్కరికి రోజుకు 300 చెల్లించింది. అంతే కాదు వారికి బిర్యానీ, మద్యం కూడా అందించాయి రాజకీయ పార్టీలు.అన్నీ కలిపి ఒక్కొక్కరికి 500 రూపాయలు ఖర్చు పెట్టాయి.

ర్యాలీలు, సమావేశాల్లో వేలాది మంది పాల్గొన్నారు. అంతే కాకుండా రాజకీయ పార్టీలు కులాల వారీగా భోజన పానీయాలు అందజేస్తూ సమావేశాలు నిర్వహించాయ‌ని పద్మనాభ రెడ్డి తెలిపారు.

ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఎన్నికల బరిలో ఉన్న రాజకీయ పార్టీలు సర్పంచ్‌లను, ఇతర కార్యకర్తలను కొనుగోలు చేయడం ప్రారంభించాయని రెడ్డి ఆరోపించారు.

పార్టీలు మారడానికి ఒక్కొక్కరికి ఒక్కో ధర డిసైడ్ చేశారు. దీనిపై ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. గత నెల రోజులుగా మునుగోడు ప్రజలను పార్టీలు అత్యధికంగా భ్రష్టు పట్టించాయని ఆయన అన్నారు.

"చాలా చోట్ల ప్రజలు డబ్బును డిమాండ్ చేశారు. డబ్బులు అందని వారు ధర్నాలు చేశారు. కొన్ని గ్రామాల్లో ఎన్నికల రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు 'డబ్బు ఇవ్వకుంటే ఓటు వేయం ' అనే ప్లకార్డులతో ప్రజలు రోడ్లపై కూర్చున్నారు. చివరికి వారి డిమాండ్లకు తలొగ్గిన రాజకీయ పార్టీలు డబ్బులిచ్చాయి. దాంతో ఆయా గ్రామాల్లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన పోలింగ్ రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. కొన్ని గ్రామాలలో, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఓటుకు 5,000 వచ్చాయని , తమకు మాత్రం అందలేదని పేర్కొంటూ ప్రజలు ధర్నాలకు దిగారు. అని FGG ఆరోపించింది.

ప్రజలు డబ్బు డిమాండ్ చేశారనడానికి తగిన ఆధారాలు ఉన్నాయని, ఎన్నికల సంఘం వీటిపై విచారణ చేపట్టాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ డిమాండ్ చేసింది.

First Published:  13 Nov 2022 3:53 AM GMT
Next Story