Telugu Global
Telangana

మునుగోడు ఎన్నిక కోసం రంగంలోకి ఓయూ స్టూడెంట్స్

ఉస్మానియా యూనివర్సిటీ అంటే అది ఒక చదువుల నిలయం మాత్రమే కాదు... ఉద్యమాలకు పురిటిగడ్డ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంలో ఓయూ విద్యార్థులది ముఖ్య పాత్ర అని ప్రతీ ఒక్కరికి తెలుసు.

మునుగోడు ఎన్నిక కోసం రంగంలోకి ఓయూ స్టూడెంట్స్
X

ఉస్మానియా యూనివర్సిటీ అంటే అది ఒక చదువుల నిలయం మాత్రమే కాదు... ఉద్యమాలకు పురిటిగడ్డ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంలో ఓయూ విద్యార్థులది ముఖ్య పాత్ర అని ప్రతీ ఒక్కరికి తెలుసు. ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఓయూ విద్యార్థి సంఘాలు ఓక్కో పార్టీకి మద్దతు ఇస్తూ వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బలహీనంగా ఉన్న సమయంలో ఓయూ విద్యార్థులే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఇక ఓయూ విద్యార్థి జేఏసీది మరో దారి. చట్ట సభల్లో ఉద్యమకారులకు సముచిత స్థానం ఇవ్వాలని పోరాడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఎప్పుడు, ఎక్కడ ఎన్నికలు జరిగిన తమ మద్దతు ప్రకటిస్తూ ఉద్యమకారులను గెలిపించుకుంటున్నారు.

ఇటీవల కాలంలో దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల జరిగిన సమయంలో పార్టీలకు అతీతంగా ఉద్యమకారులకు ఓయూ జేఏసీ మద్దతు తెలిపింది. యూనివర్సిటీ విద్యార్థులు ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో ఆ రెండు ఎన్నికల్లో పని చేశారు. రఘునందన్ రావు, రాజేందర్ గెలుపులో ఓయూ విద్యార్థుల పాత్ర కూడా ఉన్నది. ఇక ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికపై ఓయూ విద్యార్థులు ఫోకస్ పెట్టారు. ఓయూలో చదువుకునే విద్యార్థుల్లో అత్యధిక మంది ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వాళ్లే ఉన్నారు. దీంతో మునుగోడులో ప్రత్యక్షంగా బరిలోకి దిగాలని ఓయూ జేఏసీ నిర్ణయం తీసుకున్నది. మరోసారి ఉద్యమకారులను గెలిపించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. బీజేపీ అభ్యర్థి ఎవరో తెలిసినా.. కాంగ్రెస్, టీఆర్ఎస్‌ల తరపున ఎవరు పోటీలో ఉంటారో ఇంకా తెలియదు. ఒకసారి ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చి.. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఓయూ విద్యార్థి జేఏసీ బరిలోకి దిగాలని భావిస్తోంది.

మునుగోడు నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికి విద్యార్థులు బృందాలుగా విడిపోయి పర్యటించనున్నారు. ఓటర్లకు అభ్యర్థలపై అవగాహన కల్పించి, ఉద్యమకారులను గెలిపించుకోవల్సిన అవసరం ఉందని చెప్పనున్నారు. పల్లె రవికుమార్ కనుక బరిలో ఉంటే ఆయనకు మద్దతు ఇవ్వాలని కూడా జేఏసీలోని కీలక నేతలు భావిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలో కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంది. అంతే కాకుండా అక్కడి ఓటర్లు కూడా చైతన్యం కలిగిన వాళ్లే. ఓయూ విద్యార్థుల కనుక అక్కడ ప్రచారం చేస్తే తప్పకుండా అభ్యర్థి గెలుపును ప్రభావితం చేస్తారని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే రెండు పార్టీలో వారితో చర్చలు జరపాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే ఉద్యమకారులకే తమ మద్దతు అని ప్రకటించడంతో కాస్త గందరగోళం నెలకొన్నది.

కోమటిరెడ్డి కుటుంబం సహా.. మునుగోడులో పలు పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్న చాలా మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్లే. మరి వారిలో ఓయూ విద్యార్థి జేఏసీ ఎవరికి మద్దతు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. జర్నలిస్టు, ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రవివైపే చాలా మంది మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నా.. అసలు ఆయనకు కాకుండా ఇతరులకు టికెట్ వస్తే ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికే అందరినీ కలుపుకొని పోయేలా వ్యూహం రచించింది. చెరుకు సుధాకర్ ఇప్పటికే కాంగ్రెస్‌తో పని చేయడానికి సై అంటున్నారు. కమ్యూనిస్టు పార్టీలతో పాటు ప్రొఫెసర్ కోదండరాం మద్దతు కూడా కాంగ్రెస్ అడుగుతోంది. అలాగే తెలంగాణ రావడంలో కాంగ్రెస్ పార్టీదే కీలక పాత్ర కాబట్టి.. తమకు మద్దతు ఇవ్వాలని ఓయూ విద్యార్థి సంఘాలను కోరుతోంది. మరి ఓయూ జేఏసీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

First Published:  15 Aug 2022 10:33 AM GMT
Next Story