Telugu Global
Telangana

తెలంగాణలో వెలవెలబోతున్న పొరుగు రాష్ట్రాల బస్సులు

తెలంగాణలో కూడా సూపర్ లగ్జరీ బస్సుల్లో సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ఉచిత ప్రయాణం ఎక్స్ ప్రెస్ సర్వీసు వరకే పరిమితం కావడంతో.. ఎక్కువమంది రద్దీగా ఉన్నా కూడా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ సర్వీసుల్నే ఆశ్రయిస్తున్నారు.

తెలంగాణలో వెలవెలబోతున్న పొరుగు రాష్ట్రాల బస్సులు
X

మహాలక్ష్మి పథకంతో తెలంగాణ ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. కాలు పెట్టడానికి కూడా అవకాశం లేని రద్దీ ఉంటోంది. అదే సందర్భంలో పొరుగు రాష్ట్రాల ఆర్టీసీ బస్సుల్లో మాత్రం టికెట్లు తెగట్లేదు. జనాలు లేక సర్వీసులన్నీ నష్టాలతోనే ముగుస్తున్నాయని వాపోతున్నారు పొరుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు. మహిళలంతా ఉచిత ప్రయాణం అవకాశం ఉన్న తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఎక్కేందుకే ఆసక్తి చూపిస్తుండటంతో పొరుగు రాష్ట్రాల బస్సులు వెలవెలబోతున్నాయి.

మగవాళ్లకు ఊరట..

పొరుగు రాష్ట్రాల బస్సులకు లాభాలు రాకపోయినా.. తెలంగాణలో మగవారికి మాత్రం అవి ఊరటనిస్తున్నాయి. ఆడవాళ్లంతా తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఎక్కుతుంటే, మగవాళ్లు ఆ రద్దీని తట్టుకోలేక పొరుగు రాష్ట్రాల బస్సుల్లో ప్రయాణాలు చేస్తున్నారు. ఒకరకంగా ఇది మగవారికి ఉపశమనమే అయినా.. ఆశించిన స్థాయిలో ఆక్యుపెన్సీ రేషియో లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్, కర్నాటక బస్సు సర్వీసులకు కనీసం డీజిల్ ఖర్చులు కూడా రావట్లేదని తెలుస్తోంది.

హైదరాబాద్‌ నుంచి ఏపీలోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖ, ఒంగోలు, తిరుపతి, కర్నూలు వంటి నగరాలకు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఏపీ నుంచి ఖమ్మం, మహబూబ్‌ నగర్‌, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలకు బస్సు సర్వీసులు ఉన్నాయి. ఇక కర్నాటకలోని బెంగళూరు, బీదర్‌, రాయచూరు వంటి ప్రాంతాల నుంచి హైదరాబాద్‌ కు ఆ రాష్ట్ర బస్సులు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉన్నా కూడా హైదరాబాద్ నుంచి నేరుగా ఎవరూ ఆ బస్సులు ఎక్కట్లేదు. తెలంగాణ సరిహద్దుల వరకు టీఎస్‌ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్నారు. అక్కడినుంచి అవకాశాన్ని బట్టి ఇతర రాష్ట్రాల బస్సులు ఎక్కుతున్నారు మహిళలు.

హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే కొందరు మహిళలు.. కోదాడ వరకు టీఎస్ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ బస్సులో వచ్చి, అక్కడినుంచి లగ్జరీ బస్సులు ఎక్కుతున్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లాలన్నా.. అశ్వారావు పేట వరకు ఇలా కట్ జర్నీ చేస్తున్నారు. సంక్రాంతి ప్రయాణాల రిజర్వేషన్లు కూడా నేరుగా హైదరాబాద్ నుంచి కాకుండా కోదాడ నుంచి చేయించుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. భార్య టీఎస్ఆర్టీసీ బస్సు ఎక్కితే భర్త ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఎక్కి ఒకే ఊరిలో దిగుతున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి.

తెలంగాణలో కూడా సూపర్ లగ్జరీ బస్సుల్లో సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ఉచిత ప్రయాణం ఎక్స్ ప్రెస్ సర్వీసు వరకే పరిమితం కావడంతో.. ఎక్కువమంది రద్దీగా ఉన్నా కూడా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ సర్వీసుల్నే ఆశ్రయిస్తున్నారు.

First Published:  1 Jan 2024 2:17 AM GMT
Next Story