Telugu Global
Telangana

ఉస్మానియాలో నిజానిజాలివే.. క్లారిటీ ఇచ్చిన ఆస్పత్రి సూపరింటెండెంట్

ఉస్మానియా ఆస్పత్రి, కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా నాణ్యమైన వైద్యసేవలు అందిస్తోందని తెలిపారు సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్. అల్ట్రామోడర్న్ పరికరాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

ఉస్మానియాలో నిజానిజాలివే.. క్లారిటీ ఇచ్చిన ఆస్పత్రి సూపరింటెండెంట్
X

ఉస్మానియా ఆస్పత్రి వ్యవహారం ఇటీవల తెలంగాణలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ఆస్పత్రి నూతన భవన నిర్మాణం ఆలస్యమవుతోందని, దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వమేనంటూ నిందలేశారు గవర్నర్ తమిళిసై. ఆస్పత్రి తనిఖీకి వెళ్లి ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. మంత్రి హరీష్ రావు ఇచ్చిన కౌంటర్లు కూడా కాస్త ఘాటుగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఉస్మానియా ఆస్పత్రి పరిస్థితి ఎలా ఉంది, గవర్నర్ చెప్పినట్టుగా అక్కడ సౌకర్యాలు లేవా..? పేదలకు అక్కడ అందుతున్న వైద్య సేవలేంటి..? ఇలాంటి విషయాలను వివరించారు ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్.


ఉస్మానియా జనరల్ ఆస్పత్రి(OGH)లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, నిపుణులైన వైద్యులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్. అయితే విశాలమైన నూతన భవనం అవసరం ఉందని, దానికి స్థలం కొరత ఉందని ఆయన చెప్పారు. స్థలం కోసం పాత బిల్డింగ్ ని కూల్చివేయాల్సిన అవసరం ఉందన్నారు. అది వారసత్వ కట్టడం కావడంతో కొన్ని అడ్డంకులున్నాయని, కోర్టు కేసులతో కూల్చివేత ఆలస్యమవుతోందని వివరించారు. 2015నుంచి కొత్త బిల్డింగ్ కోసం సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నా కోర్టు కేసులతో అది ఆలస్యమవుతోందని చెప్పారు.

ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో 1092 పడకలు రోగులకు అందుబాటులో ఉన్నాయి. పాత బిల్డింగ్ ని కూల్చి వేసి కొత్త బిల్డింగ్ నిర్మిస్తే 1800 నుంచి 2000 పడకలు అందుబాటులోకి వస్తాయి. 50 సంవత్సరాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త భవనం నిర్మించాలంటున్నాయి ఆస్పత్రి వర్గాలు.

కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా..

ఉస్మానియా ఆస్పత్రి, కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా నాణ్యమైన వైద్యసేవలు అందిస్తోందని తెలిపారు సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్. అల్ట్రామోడర్న్ పరికరాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. జాయింట్ రీప్లేస్‌ మెంట్ సర్జరీలు, లివర్, కిడ్నీ ట్రాన్స్‌ ప్లాంటేషన్ ఆపరేషన్లు, న్యూరో సర్జరీ ట్రీట్‌ మెంట్లు ఉస్మానియాలో ఉచితంగా జరుగుతాయని అన్నారు. స్కిన్ బ్యాంక్ సౌకర్యం ఉస్మానియాలో ఉందని, LGBT కమ్యూనిటీ కోసం ప్రత్యేక లింగమార్పిడి క్లినిక్‌ ని కూడా నిర్వహిస్తున్నామని చెప్పారాయన. హిమోఫిలియా సెంటర్, నేషనల్ వైరల్ హెపటైటిస్ సెంటర్లో రోగులకు ఉచిత చికిత్స, టీకాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో 1092 బెడ్లు అందుబాటులో ఉండగా.. 889 రోగులు ఇన్ పేషెంట్లుగా ఆస్పత్రిలో ఉన్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉస్మానియా ఆస్పత్రిలో పేషెంట్ కేర్ సేవలు గణనీయంగా మెరుగుపడ్డాయన్నారు.

అవి అపోహలే..

ఇటీవల ఆస్పత్రి పరిశీలనకు గవర్నర్ తమిళిసై రావడంతో రోగులు, వారి బంధువులు ఒకేచోట గుమికూడారని, వారిని చూసి ఆమె రద్దీ ఎక్కువగా ఉన్నట్టు భావించారని చెప్పారు సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్. ఉస్మానియా ఆసుపత్రికి తెలంగాణ, ఏపీ నుంచే కాకుండా.. మహారాష్ట్ర, కర్నాటక సహా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రోగులు వస్తుంటారని చెప్పారు. ఇప్పటికే ఇక్కడ అనేక అరుదైన ఆపరేషన్లు జరిగాయని, కొత్త భవనం అందుబాటులోకి వస్తే సేవలను మరింతగా విస్తరిస్తామని చెప్పారాయన. కొత్త భవనం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని, అభివృద్ధికి సహకరిస్తోందని వివరించారు.

First Published:  5 July 2023 4:18 PM GMT
Next Story