Telugu Global
Telangana

ఆ రోజు 9 జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించండి.. బీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపు

ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయా జిల్లాల్లో 20 వేల మందితో ర్యాలీలు నిర్వహించాలని చెప్పారు.

ఆ రోజు 9 జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించండి.. బీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపు
X

వైద్య విద్య రంగంలో దేశంలోనే తెలంగాణను నంబర్ 1గా నిలబెట్టాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం. ఈ క్రమంలోనే జిల్లాకొక ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో కళాశాలలు ఏర్పాటు చేయగా.. తాజాగా ఈ నెల 15న 9 జిల్లాల్లో ఒకే సారి 9 కాలేజీలు ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ వర్చువల్ పద్దతిలో వీటిని ప్రారంభిస్తారని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కొత్తగా కాలేజీలు ప్రారంభించినున్న జిల్లాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీలు నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

మెడికల్ కళాశాలలు ప్రారంభించనున్న కామారెడ్డి, కరీంనగర్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, నిర్మల్, సిరిసిల్ల, వికారాబాద్, ఖమ్మం, జనగాం జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయా జిల్లాల్లో 20 వేల మందితో ర్యాలీలు నిర్వహించాలని చెప్పారు. మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులకే కాకుండా.. ప్రజలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ విషయాలన్నీ వారికి అర్థమయ్యేలా వివరించాలని సూచించారు.

ర్యాలీల్లో యువతను, విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని చెప్పారు. ఆ రోజు సీఎం కేసీఆర్ ఒక మెడికల్ కాలేజీని స్వయంగా సందర్శించి ప్రారంభించే అవకాశం ఉందని కేటీఆర్ వెల్లడించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కామారెడ్డి మెడికల్ కాలేజీ ఓపెనింగ్‌లో పాల్గొంటారని చెప్పారు.

ఐదు దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతానికి రెండు కాలేజీలు మాత్రమే తీసుకొని రాగలిగిందని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశవ్యాప్తంగా 157 కాలేజీలను మంజూరు చేసింది. కానీ తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వకుండా మొండి చేయి చూపిందని మంత్రి విమర్శించారు. ఆ రెండు పార్టీలు మోసం చేసినా.. సీఎం కేసీఆర్ మాత్రం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఆహార ఉత్పత్తిలోనే కాకుండా.. దేశ ఆరోగ్యానికి కీలకమైన డాక్టర్లను తయారు చేసే కార్ఖానాగా ఎదిగిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. దేశంలో అత్యధిక ఎంబీబీఎస్ సీట్లు కలిగిన రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని అన్నారు.

First Published:  8 Sep 2023 3:14 PM GMT
Next Story