Telugu Global
Telangana

తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. ఎండల తీవ్రత పెరుగుతుందని ఐఎండీ హెచ్చరిక

వాయువ్య దిశ నుంచి తెలంగాణ వైపు గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నది. దీంతో రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ అంతటా పొడి వాతావరణం నెలకొంటుంది.

తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. ఎండల తీవ్రత పెరుగుతుందని ఐఎండీ హెచ్చరిక
X

తెలంగాణ ప్రాంతంలో వర్షాల కారణంగా గత కొన్ని రోజులుగా చల్లగా ఉన్న వాతావరణం.. క్రమంగా వేడెక్కుతోంది. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో పగటి పూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెంటిగ్రేడ్లను మించి నమోదవుతోంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఎల్లో అలర్ట్‌ను.. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది.

సైక్లోన్ మోచా కారణంగానే క్రమంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ఐఎండీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం వాయువ్య దిశ నుంచి తెలంగాణ వైపు గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నది. దీంతో రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ అంతటా పొడి వాతావరణం నెలకొంటుంది. అదే సమయంలో పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని చెప్పారు.

ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల వరకు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. ప్రజలు వడగాల్పుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్పారు. ఇక తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీలకు చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. తెలంగాణ అంతటా తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్నది.

ఇక రాష్ట్ర డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ డేటా ప్రకారం ఆదివారం మంచిర్యాలలో 45.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, ఆసిఫాబాద్ జిల్లాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యింది. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ వద్ద 40.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.

First Published:  15 May 2023 11:09 AM GMT
Next Story