Telugu Global
Telangana

నిజ‌మేనా! కేటీఆర్ చెబుతున్న‌ట్లు విప‌క్షాల‌కు అభ్య‌ర్థులే లేరా..?

దశాబ్దాలుగా పాతుకుపోయిన ఆ పార్టీకి అభ్య‌ర్థులు క‌రువేమీ ఉండ‌దు. కానీ, అందులో ఎంత మంది సీటు గెలుచుకురాగ‌ల స‌మ‌ర్థులంటే రేవంత్‌రెడ్డి ద‌గ్గ‌ర కూడా స‌మాధానం లేదు.

నిజ‌మేనా! కేటీఆర్ చెబుతున్న‌ట్లు విప‌క్షాల‌కు అభ్య‌ర్థులే లేరా..?
X

తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి బీఆర్ఎస్ దూసుకెళ్తుంటే.. విప‌క్షాలైన కాంగ్రెస్‌, బీజేపీల‌కు అభ్య‌ర్థులే లేర‌ని మంత్రి కేటీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న తెలంగాణ రాజకీయ వ‌ర్గాల్లో హాట్‌టాపిక్ అవుతోంది. అవునా..! కేటీఆర్ చెప్పింది నిజ‌మేనా అని విప‌క్ష పార్టీలే కాదు తెలంగాణ ప్ర‌జానీకం కూడా ఈ కామెంట్స్‌ను త‌ర‌చి చూస్తోంది. అస‌లు ఇంత‌కీ విప‌క్షాల‌కు 119 స్థానాల‌కూ అభ్య‌ర్థులు ఉన్నారా.. అంటే అనుమాన‌మే.

కాంగ్రెస్‌లో ప‌రిస్థితి ఏంటి..?

ఈసారి తెలంగాణ‌లో ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉన్న కాంగ్రెస్‌లో అభ్య‌ర్థుల‌కు కొద‌వ లేదు. దశాబ్దాలుగా పాతుకుపోయిన ఆ పార్టీకి అభ్య‌ర్థులు క‌రువేమీ ఉండ‌దు. కానీ, అందులో ఎంత మంది సీటు గెలుచుకురాగ‌ల స‌మ‌ర్థులంటే రేవంత్‌రెడ్డి ద‌గ్గ‌ర కూడా స‌మాధానం లేదు. 2014, 2019 ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ (అప్ప‌టి టీఆర్ఎస్‌) ధాటికి మ‌హామ‌హా నేత‌లే కూక‌టివేళ్ల‌తో పెక‌లించుకుపోయారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో చ‌క్రం తిప్పిన పొన్నాల ల‌క్ష్మ‌య్య‌, దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌, ష‌బ్బీర్ అలీ, ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్‌, జానారెడ్డి లాంటి ఉద్ధండులే కారు స్పీడుకు క‌కావిక‌ల‌మైపోయారు. రాజ‌కీయంగా ఉనికి కోసం పోరాడుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో మిగ‌తా యువ నాయ‌కులు బ‌ల‌మైన బీఆర్ఎస్‌ను ఢీకొట్టి ఎంత‌వ‌ర‌కు నిల‌బ‌డ‌తార‌నేది అనుమాన‌మే. అందుకే కేటీఆర్ అన్న‌ట్లు కాంగ్రెస్‌లో అభ్య‌ర్థులు లేక‌పోవ‌డం కాదు కానీ, వాళ్లు గెలుపుగుర్రాలా కాదా అన్న‌దే ఇక్క‌డ ప్ర‌శ్న‌..

బీజేపీ.. ఛాన్సే లేదు

ఇక తెలంగాణ‌లో మూడో ప్ర‌త్యామ్నాయంగా తెర‌పైకి వ‌చ్చి, గ‌త రెండేళ్ల‌పాటు బీఆర్ఎస్‌కి తామే అస‌లైన పోటీ అన్న‌ట్లు వాతావార‌ణం క్రియేట్ చేసిన బీజేపీకి ఇప్పుడా ప‌రిస్థితి లేనే లేదు. క‌ర్ణాట‌క‌లో ఓటమి త‌ర్వాత ప‌క్క‌నున్న తెలంగాణ‌పై ఆ ప్ర‌భావం బాగా ప‌డింది. దానికితోడు బండి సంజ‌య్‌కు అధ్యక్ష ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డంతో మ‌రింత బ‌ల‌హీన‌ప‌డ్డ‌ట్లు క‌నిపిస్తోంది. ముందే 119 స్థానాల‌కు అభ్య‌ర్థులు వెతుక్కోలేని ప‌రిస్థితిలో ఉండే బీజేపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప‌క్క‌పార్టీల్లో ఆశాభంగ‌మైన నేత‌లు ఎవ‌రైనా వ‌స్తే బీఫారం ఇద్దామ‌ని వేచి చూసే ప‌రిస్థితిలో ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌.

First Published:  20 Aug 2023 5:33 AM GMT
Next Story