Telugu Global
Telangana

'ఆపరేషన్ బొగ్గు'.. రాజగోపాల్ మొహానికి మసి..

మధుయాష్కీ గౌడ్ విడుదల చేసిన 'ఆపరేషన్ బొగ్గు' ఇప్పుడు సంచలనంగా మారింది. ఏయే రోజుల్లో ఏమేం జరిగిందో వివరంగా ఆయన పేపర్ కటింగ్ లతో సహా 'ఆపరేషన్ బొగ్గు'లో పొందుపరిచారు. ఇప్పటి వరకూ ఆరోపణలంటూ కొట్టి పారేసిన రాజగోపాల్ రెడ్డి ఈ సాక్ష్యాధారాలు చూసిన తర్వాత మరింత షాకవడం ఖాయం.

ఆపరేషన్ బొగ్గు.. రాజగోపాల్ మొహానికి మసి..
X

18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ అండ చూసుకుని కాంగ్రెస్ కి రాజీనామా చేసి బీజేపీ చంక ఎక్కిన రాజగోపాల్ రెడ్డికి ఇప్పుడు అదే కాంట్రాక్ట్ గుదిబండగా మారింది. ఆమధ్య టీవీ డిబేట్ లో కాంట్రాక్ట్ వచ్చిన విషయాన్ని తనకు తానే బయటపెట్టుకున్న ఆయన్ను వైరి వర్గాలు వెంటాడుతున్నాయి. ఇప్పటి వరకూ టీఆర్ఎస్ నేతలు ఈ కాంట్రాక్ట్ విషయంలో రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేయగా, ఇప్పుడు కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ 'ఆపరేషన్ బొగ్గు' అనే పేరుతో అసలా కాంట్రాక్ట్ పుట్టు పూర్వోత్తరాలన్నీ వెలికి తీశారు. 18,264 కోట్ల రూపాయలకు మునుగోడు ప్రజల ఆత్మ గౌరవాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి అమ్ముకున్నారంటూ ఓ నివేదిక విడుదల చేశారు.

పక్కా ఆధారాలు..

ఇన్నాళ్లూ 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ అంటున్నారే కానీ, దాని వివరాలేవీ పూర్తిస్థాయిలో జనాలకు తెలియలేదు. ఎన్నికలకు టైమ్ దగ్గరపడిన ఈ సమయంలో రాజగోపాల్ రెడ్డి నిజస్వరూపాన్ని బట్టబయలు చేశారు మధుయాష్కీ. జార్ఖండ్ లోని చంద్రగుప్త్ బొగ్గు గనుల కేటాయింపుతో ఈ డీల్ కుదిరిందని వివరించారాయన. ఈ విషయంలో మోదీకి అత్యంత ఆప్తుడు అదానీని సైతం పక్కనపెట్టడం విశేషం. అదానీ సంస్థకు మంజూరు కావాల్సిన చంద్రగుప్త్ బొగ్గు గని టెండర్ ని అనూహ్యంగా రద్దు చేసి కొత్తగా టెండర్ పిలిచి దాన్ని రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి చెందిన సుశీ సంస్థకు కేటాయించారు. బొగ్గు గని ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం 3,437 కోట్ల రూపాయలు కాగా, ప్రాజెక్ట్ విలువ 18,264 కోట్ల రూపాయలు. అంటే.. 520శాతం ఆదాయం సుశీ కంపెనీకి గ్యారెంటీ అన్నమాట.

ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు..

ఈ కాంట్రాక్ట్ రాజగోపాల్ రెడ్డికి దక్కే క్రమంలో రాజకీయం అనేక మలుపులు తిరిగింది. బీజేపీ తనతో సంప్రదింపులు జరుపుతోందని ఒకసారి, ఆ తర్వాత బీజేపీలో చేరేది లేదంటూ మరోసారి రాజగోపాల్ రెడ్డి స్టేట్ మెంట్ లు ఇవ్వడం వ్యూహంలో భాగమేనని తేల్చారు. మార్చి 17వ తేదీ బీజేపీలో తాను చేరేదే లేదంటూ తేల్చేసిన రాజగోపాల్ రెడ్డి, 22వ తేదీకే ప్లేటు ఫిరాయించారు, కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ఆ తర్వాత మే, జూన్, జూలైలో జరిగిన వరుస సంఘటనలు అనుమానాలను బలపరిచాయి. చివరిగా జూలై 27న రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారని బండి సంజయ్ ప్రకటించారు.

ఈ ఎపిసోడ్ లో 2021 జనవరి నుంచి డిసెంబర్ వరకు చర్చల పర్వం జరిగింది. 2022 జనవరి నుంచి జూలై వరకు నాటకం నడిచింది. ఆగస్ట్ 2022లో తుది ఘట్టం వెలుగులోకి వచ్చింది. ఇదీ క్లుప్తంగా రాజగోపాల్ రెడ్డి రాజకీయం.. అంటూ మధుయాష్కీ గౌడ్ విడుదల చేసిన 'ఆపరేషన్ బొగ్గు' ఇప్పుడు సంచలనంగా మారింది. ఏయే రోజుల్లో ఏమేం జరిగిందో వివరంగా ఆయన పేపర్ కటింగ్ లతో సహా 'ఆపరేషన్ బొగ్గు'లో పొందుపరిచారు. ఇప్పటి వరకూ ఆరోపణలంటూ కొట్టి పారేసిన రాజగోపాల్ రెడ్డి ఈ సాక్ష్యాధారాలను చూసిన తర్వాత మరింత షాకవడం ఖాయం. ఇక బుకాయించే ఛాన్స్ కూడా ఆయనకు ఉండకపోవచ్చు. ఇప్పటికే ఓటమిని ఊహించి అజ్ఞాతంలో ఉండిపోయిన రాజగోపాల్ రెడ్డికి ఈ నివేదిక ఫినిషింగ్ టచ్ అనే చెప్పాలి.

First Published:  30 Oct 2022 7:59 AM GMT
Next Story