Telugu Global
Telangana

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ మాత్రమే.. కొల్లాపూర్ సభలో రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు బంధు నిలిచిపోతుందని ఆరోపిస్తున్నారు. అందులో ఎలాంటి వాస్తవం లేదని రాహుల్ గాంధీ చెప్పారు.

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ మాత్రమే.. కొల్లాపూర్ సభలో రాహుల్ గాంధీ
X

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు నిలిచిపోతుంది.. కరెంటు ఆగిపోతుందని చాలా మంది విమర్శిస్తున్నారు. కానీ అందులో వాస్తవం లేదు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు మరింత మేలు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వస్తామని పునరుద్ఘాటించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా కొల్లాపూర్‌లో నిర్వహించిన 'ప్రజా భేరి' సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. బీజేపీ, బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు.

రాబోయే ఎన్నికలు ప్రజల తెలంగాణ, దొరల తెలంగాణకు మధ్య జరగబోతున్నాయి. తెలంగాణలొ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ఒక వైపు ఉంటే.. మరోవైపు తెలంగాణ సమాజం, నిరుద్యోగులు, మహిళలు ఉన్నారని రాహుల్ చెప్పారు. తెలంగాణలో ఏం జరుగుతోందో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో అతిపెద్ద మోసం జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రజల ఆకాంక్షలను బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తుంగలోతొక్కాయని.. లక్షల కోట్ల రూపాయలను దోచేశారని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు బంధు నిలిచిపోతుందని ఆరోపిస్తున్నారు. అందులో ఎలాంటి వాస్తవం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తాము. అలాగే కౌలు రైతులకు, రైతు కూలీలకు రూ.12 వేలు సాయంగా అందిస్తామని రాహుల్ వాగ్దానం చేశారు. గతంలో తెలంగాణ ప్రజల, రైతుల, సామాన్యుల సొమ్ములను దోచుకున్నారు. కానీ తాము వచ్చాక అన్ని వర్గాల ప్రజలను అదుకుంటామని రాహుల్ హామీ ఇచ్చారు.

లక్షల కోట్ల రూపాయల వ్యయం చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోతున్నాయి. ఇప్పటి వరకు ఆ కుటుంబం దోచుకున్న సొమ్మును తెలంగాణలోని ప్రతీ కుటుంబం కట్టాల్సి ఉంటుంది. 2040 వరకు ఏడాదికి రూ.31 వేలను తెలంగాణలోని ప్రతీ కుటుంబం నుంచి వసూలు చేస్తే కానీ ఈ అప్పులు తీరవని రాహుల్ చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం కట్టానని చెప్పుకుంటున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో అనేక సాగు నీటి ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని రాహుల్ స్పష్టం చేశారు. వీళ్లు కట్టిన కాళేశ్వరాన్ని.. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులను ఒక సారి గమనించాలని రాహుల్ కోరారు.

కాంగ్రెస్ నేతృత్వంలోనే దళితులు, ఆదివాసీలు, పేదల భూములను తిరిగి ఇచ్చింది కాంగ్రెస్ పరిపాలనలోనే.. అలాంటి గొప్ప నిర్ణయం తీసుకొని పేదలకు భూములు పంచితే.. ఈ ప్రభుత్వం ధరణి పేరుతో అన్నింటినీ గుంజుకున్నదని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులకు, బంధువులకు, ప్రజా ప్రతినిధులకు మాత్రమే లబ్ది చేకూరుస్తోందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో కీలకమైన శాఖలు అన్నీ కల్వకుంట్ల కుటుంబం దగ్గరే ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. ప్రజా తెలంగాణ కోసం పోరాడితే.. చివరకు అది దొరల తెలంగాణ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ కలను సాకారం చేయబోయేది కేవలం కాంగ్రెస్ మాత్రమే అని రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు.

బీజేపీ, ఎంఐఎం పార్టీలు కలిసి పని చేస్తున్నాయి. లోక్‌సభలో బీజేపీకి సీఎం కేసీఆర్ పూర్తి మద్దతు ఇచ్చారు. జీఎస్టీ, రైతు చట్టాల బిల్లుల కోసం లోక్‌సభలో బీజేపీకి కేసీఆర్ సపోర్ట్‌గా నిలిచారని ఆరోపించారు. దేశంలోని ప్రతిపక్ష నాయకులందరి పైనా కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తున్నాయి. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మాత్రం ఎలాంటి కేసులు ఉండవని రాహుల్ గుర్తు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీల లక్ష్యం రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించడమే అని అన్నారు. మేం ఇక్కడ బీఆర్ఎస్‌తో కేంద్రంలో బీజేపీతో పోట్లాడుతున్నామని చెప్పుకొచ్చారు.

తెలంగాణ ప్రజలు మంచి మనసుతో ఒక నిర్ణయం తీసుకోవాలని కోరారు. అధికారం, మీడియా సీఎం కేసీఆర్ వెంట ఉంటే.. ప్రజల విశ్వాసం కాంగ్రెస్‌కు ఉందని రాహుల్ గాంధీ చెప్పారు. తెలంగాణ ప్రజలతో మాకు ఉన్నది రాజకీయ బంధం కాదని.. ఇది కుటుంబ బంధమని మరోసారి గుర్తు చేశారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాము.. అలాగే తెలంగాణలో కూడా ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తామని రాహుల్ గాంధీ చెప్పారు.

First Published:  31 Oct 2023 3:50 PM GMT
Next Story