Telugu Global
Telangana

1,500 మందికి ఒక పోలింగ్ బూత్.. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం

ప్రస్తుతం బూత్ లెవెల్ అధికారులు (బీఎల్ఓ) క్షేత్ర స్థాయిలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. అదే సమయంలో పోలింగ్ బూత్‌ల హేతుబద్దీకరణ కూడా జరుగుతుందని ఎన్నికల సంఘం చెబుతోంది.

1,500 మందికి ఒక పోలింగ్ బూత్.. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం
X

ఓటర్లకు సౌకర్యంగా ఉండటానికి ప్రతీ 1,500 మందికి ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం రాష్ట్రంa 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఉన్న 2,99,92,941 మంది ఓటర్లు ఉండగా.. వారి కోసం 34,891 పోలింగ్ బూత్స్ ఏర్పాటు చేశారు. కాగా, ప్రస్తుతం తెలంగాణలో కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పిడి కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 4 న తుది జాబితాను ప్రకటించనున్నారు. అప్పటికి ఓటర్ల సంఖ్య మరింతగా పెరుగుతుందని ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది. అందుకే పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణకు శ్రీకారం చుట్టింది.

ప్రస్తుతం బూత్ లెవెల్ అధికారులు (బీఎల్ఓ) క్షేత్ర స్థాయిలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. అదే సమయంలో పోలింగ్ బూత్‌ల హేతుబద్దీకరణ కూడా జరుగుతుందని ఎన్నికల సంఘం చెబుతోంది. రాష్ట్రంలోని అర్బన్ ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నది. ఇక్కడి పోలింగ్ బూత్‌లలో అనేక రకాల లోపాలను గుర్తించారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల్లో అనేక లోటుపాట్లు ఉన్నాయి. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులకు వేర్వేరు పోలింగ్ బూత్‌లు, కేంద్రాల్లో ఓట్లు ఉన్నాయి. ఇది వారికి ఇబ్బందికరంగా మారుతోంది. అందుకే ఇకపై ఒకే కుటుంబంలో ఉన్న ఓటర్లందరికీ.. ఒకే బూత్‌లో ఓట్లు ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి డీఎస్ లోకేశ్ కుమార్ చెప్పారు.

కాలనీ లేదా బస్తీ ఆధారిత పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు పైలెట్ ప్రాజెక్టు మొదలు పెట్టామని లోకేశ్ కుమార్ వివరించారు. నగరంలోని కొన్ని డివిజన్లలో ఉన్న అసమతుల్యతలను క్రమబద్దీకరించనున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఒక్కో నియోజకవర్గంలో కనీసం 300 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. శేరిలింగంపల్లిలో అత్యధికంగా 590, మేడ్చెల్‌లో 573, ఎల్బీనగర్‌లో 545, మహేశ్వరంలో 511 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అయితే వాటిలో చాలా పోలింగ్ స్టేషన్లు.. బస్తీలు, కాలనీల నుంచి దూరంగా వేరే ప్రాంతాల్లో ఉన్నాయి. దీని వల్ల పోలింగ్ రోజున ఓటర్లకు చాలా ఇబ్బంది కలిగిస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ నెలలో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆలోపు అన్ని నియోజకవర్గాల్లో బస్తీ/కాలనీ ఆధారిత పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం కష్టమని అధికారులు చెబుతున్నారు. కానీ, పైన పేర్కొన్న నియోజకవర్గాల్లో మాత్రం పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం వోటర్ల జాబితా సవరణ జరుగుతోందని.. ఆ తర్వాత పోలింగ్ బూత్‌లలో 1,500 మంది చొప్పున ఉండేలా క్రమబద్దీకరిస్తామని సీఈవో వికాస్ రాజ్ చెప్పారు. బస్తీ ఆధారిత పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఇంకా సమయం పడుతుందని తెలిపారు.

రూరల్ ప్రాంతాల్లో ఇలాంటి సమస్యలు లేకపోయినా.. హైదరాబాద్ సహా వరంగల్, కరీంనగర్ వంటి నగరాల్లో మాత్రం ఇబ్బందిగా ఉన్నట్లు పోలింగ్ అధికారులు చెప్పారు. సాధ్యమైనంత త్వరగా ఈ ఇబ్బందులు పరిష్కారం అవుతాయని వారు పేర్కొన్నారు.

First Published:  11 Jun 2023 6:04 AM GMT
Next Story