Telugu Global
Telangana

పోలవరం వల్ల తెలంగాణలో లక్ష ఎకరాల మునక‌

పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో లక్ష ఎకరాలకు పైగా భూముల్లో పంటలు మునిగిపోతాయని తెలంగాణ నీటిపారుద‌ల శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.

పోలవరం వల్ల తెలంగాణలో లక్ష ఎకరాల మునక‌
X

తెలంగాణలో వరదల కారణంగా అనేక ప్రాంతాలు తీవ్ర నష్టాలకు గురయ్యాయి. ముఖ్యంగా భద్రాచలం జిల్లా తీవ్రంగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై మళ్ళీ చర్చ ప్రారంభమయ్యింది. పోలవరం వల్లనే తెలంగాణలోని అనేక ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయని తెలంగాణ నాయకులు, ముంపుకు పోలవరానికి సంబంధమే లేదని ఏపీ నాయకులు విమర్షలు, ప్రతి విమర్షలకు దిగుతున్న నేపథ్యంలో తెలంగాణ నీటిపారుద‌ల శాఖ పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరిగే నష్టంపై ఆందోళన వ్యక్తం చేసింది.

పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని లక్ష ఎకరాలకు పైగా భూముల్లో పంటలు మునిగిపోతాయని తెలంగాణ నీటి పారుద‌ల శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ర‌జ‌త్ కుమార్ అన్నారు. ఈ మేరకు బుధ‌వారం మీడియాతో మాట్లాడుతూ పోల‌వ‌రం ప్రాజెక్టు వ‌ల్ల తెలంగాణ‌కు జ‌రిగే న‌ష్టంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఒక్క పంటలే కాకుండా భ‌ద్రాచ‌లం, ప‌ర్ణ‌శాలలు కూడా నీటిలో మునిగిపోతాయని ఆయన తెలిపారు.

పోల‌వ‌రం బ్యాక్ వాట‌ర్ కార‌ణంగా తెలంగాణకు జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పిన ర‌జ‌త్ కుమార్ ఈ నష్టంపై అధ్య‌య‌నం చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి చాలాసార్లు నివేదించామని, అయినా కేంద్రం పట్టించుకోవడం లేదని అన్నారు.

రాజకీయ నాయకులే కాకుండా ఉన్నతాధికారులు కూడా పోలవరం వల్ల తెలంగాణకు జరుగుతున్న, జరగబోయే నష్టాలను ఏకరువు పెడుతున్నా కేంద్రం పట్టించుకోకపోవడంపై విమర్షలు వస్తున్నాయి.

First Published:  20 July 2022 10:27 AM GMT
Next Story