Telugu Global
Telangana

మెట్రో, సిటీ బస్‌కు కలిపి ఒకటే కార్డ్.. మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కీలక సమీక్ష

హైదరాబాద్ మెట్రో రైల్, టీఎస్ఆర్టీసీ సిటీ బస్సుల్లో పని చేసే కార్డును తీసుకొని రావాలని నిర్ణయించారు. ఈ కార్డు ఉపయోగించి మెట్రో రైలు, సిటీ సర్వీసుల్లో ప్రయాణం చేయవచ్చు.

మెట్రో, సిటీ బస్‌కు కలిపి ఒకటే కార్డ్.. మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కీలక సమీక్ష
X

హైదరాబాద్ విశ్వనగరంగా ఎదుగుతున్న క్రమంలో ప్రజా రవాణా వ్యవస్థలు మెరుగు పరచడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. నగర ప్రజలు ఎప్పటి నుంచో మెట్రో, సిటీ బస్, ఎంఎంటీఎస్‌కు కలిపి ఉపయోగపడేలా ఒక కార్డ్‌ను ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ కార్డ్ ప్రవేశ పెట్టాల్సి రావడంతో చాలా కాలంగా డిమాండ్ మరుగున పడింది. అయితే మారుతున్న పరిస్థితులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వ ముందుగా మెట్రో, సిటీ బస్సులకు కలిపి ఒక కార్డ్‌ను ప్రవేశ పెట్టడానికి నిర్ణయింది. ఈ మేరకు బుధవారం మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్‌తో పాటు పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు.

రాబోయే రోజుల్లో హైదరాబాద్ మెట్రో రైల్, టీఎస్ఆర్టీసీ సిటీ బస్సుల్లో పని చేసే కార్డును తీసుకొని రావాలని నిర్ణయించారు. ఈ కార్డు ఉపయోగించి మెట్రో రైలు, సిటీ సర్వీసుల్లో ప్రయాణం చేయవచ్చు. 'రూ పే' సంస్థ అందించే ఈ కార్డును ఉపయోగించి క్యాష్ లెస్ సేవలు అందుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఈ కార్డు ఎంఎంటీఎస్, క్యాబ్స్, ఆటోల చార్జీల చెల్లింపు.. రిటైల్ సేవలు, షాపింగ్ కోసం ఉపయోగించేలా దశల వారీగా విస్తరించనున్నారు. అంతే కాకుండా నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (NCMC) సేవలు అందుబాటులో ఉన్న నగరాల్లో కూడా ఈ కార్డును ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చు.

రూపే సంస్థ పలు బ్యాంకులతో ఒప్పందం చేసుకొని ఈ కార్డును జారీ చేస్తోంది. ప్రజా రవాణా వ్యవస్థలోనే కాకుండా టోల్ గేట్ల దగ్గర చెల్లింపులు, ఏటీఎం, పీవోఎస్‌ల వద్ద కూడా కార్డు పని చేసేలా రూపొందించారు. ఇప్పటికే పలు నగరాల్లో ఈ కార్డు అందుబాటులోకి వచ్చింది. తాజాగా మెట్రో, టీఎస్ఆర్టీలో పని చేసేలా కార్డును రూపొందించినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు.


First Published:  20 July 2023 4:05 PM GMT
Next Story