Telugu Global
Telangana

పని చేసే ప్రభుత్వాన్ని, పని చేసే ముఖ్యమంత్రిని మరోసారి ఆశీర్వదించండి : మంత్రి కేటీఆర్

సిరిసిల్ల పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

పని చేసే ప్రభుత్వాన్ని, పని చేసే ముఖ్యమంత్రిని మరోసారి ఆశీర్వదించండి : మంత్రి కేటీఆర్
X

ఒకనాడు సిరిసిల్ల ప్రాంతానికి వస్తే చుక్క నీరు కూడా కనపడక పోయేది. కానీ ఇవ్వాళ గోదావరి నీటితో రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి. గత పాలకులు ఏనాడూ ఇక్కడ ప్రజల సమస్యలను తీర్చడంపై దృష్టి పెట్టలేదు. కానీ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ప్రతీ ఎకరానికి నీరందిందే గొప్ప లక్ష్యాన్ని భుజానికి ఎత్తుకొని పూర్తి చేశారని మంత్రి కేటీఆర్ అన్నారు. పని చేసే ప్రభుత్వాన్ని, పని చేసే ముఖ్యమంత్రిని అందరూ కడుపులో పెట్టుకొని ఆశీర్వదించాలని మంత్రి కోరారు. సిరిసిల్ల పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

సర్వాయి పాపన్న గౌడ్, కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ వంటి మహనీయులు ఏదో ఒక కులానికో, మతానికో చెందిన వారు కాదు. సర్వాయి పాపన్న చేసిన పోరాటం కూడా ఆత్మ గౌరవం కోసం చేసిన పోరాటమే అని మంత్రి కేటీఆర్ చెప్పారు. మొదట్లో కేవలం 10 నుంచి 12 మంది అనుచరులే ఉన్నా.. ఆ తర్వాత ఒక్కొక్కరినీ కూడేసి.. గోల్కొండ ఖిల్లాపై ఆత్మగౌరవ పతాకాన్ని ఎగురవేసిన వ్యక్తి సర్వాయి పాపన్న అని మంత్రి చెప్పారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా ఆత్మ గౌరవం కోసం సాగిందని చెప్పారు. సీఎం కేసీఆర్ వెంట మొదట్లో పది, పన్నెండు మంది మాత్రమే ఉండేవారు. కానీ ఆ తర్వాత ఒక్కొక్కరిగా రాష్ట్రమంతా ఆయన వెన్నంటి వచ్చింది. అలా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి.. ప్రతీ ఏటా గోల్కొండ ఖిలాపై జెండాను ఎగురవేస్తున్నామని కేటీఆర్ చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా గౌడన్నలకు తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు. సిరిసిల్లలో గౌడ సంఘ భవనం కోసం 2 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అలాగే తన వంతుగా రూ.2 కోట్లను భవన నిర్మాణానికి మంజూరు చేస్తానని మంత్రి తెలిపారు. గౌడన్నలకు వృత్తిని మరింతగా పెంచేందుకు, వారికి ఉపాధి పెంచేందుకు మరిన్ని చర్యలు తీసుకోనున్నామని చెప్పారు. ఎక్కడ ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంటే.. అక్కడ కల్లుగీత సొసైటీలకు తాళ్లు పెంచడానికి కేటాయిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు.

రాష్ట్రంలో కులాలు, మతాలకు అతీతంగా నాలుగు కోట్ల మంది తెలంగాణ వారికి ఒక పెద్దగా సీఎం కేసీఆర్ ఉన్నారు. తెలంగాణ కోసం ఎన్నో పథకాలు అందిస్తున్న సీఎం కేసీఆర్‌ను మరోసారి ఆశీర్వదించాలని మంత్రి కోరారు. ఇక సిరిసిల్ల ప్రాంతంలో రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయిన తర్వాత కోనసీమను తలదన్నేలా పచ్చదనం పెరిగిందన్నారు. ఇక్కడ సినిమా నిర్మాణాలు కూడా చేపట్టేందుకు అవసరమైన లొకేషన్లు ఉన్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు.

బోటింగ్ ప్రారంభం...

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యాటక రంగాన్ని పటిష్టపరిచేందుకు ఇప్పటికే పర్యాటక శాఖ పలు అభివృద్ధి పనులు చేపట్టింది. తాజాగా మిడ్ మానేరు జలాశయంలో అందాలను వీక్షిస్తూ బోటింగ్ చేసుందుకు వీలుగా.. టూరిజం శాఖ ఆధ్వర్యంలో కొత్తగా ఒక బోటింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. దీన్ని మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం ప్రారంభించారు.



First Published:  18 Aug 2023 11:54 AM GMT
Next Story