Telugu Global
Telangana

అవి రెండూ కాదు.. సీఎం క్యాంపు ఆఫీసు ఇదే..!

మూడు రోజుల కిందట నానక్‌రామ్‌గూడలోని గ్రోత్‌ కారిడార్‌ బిల్డింగ్‌ను సందర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. క్యాంపు ఆఫీసు ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు.

అవి రెండూ కాదు.. సీఎం క్యాంపు ఆఫీసు ఇదే..!
X

తెలంగాణ సీఎం క్యాంపు ఆఫీసు మళ్లీ మారినట్లు సమాచారం. ముందు MCRHDలోని ఖాళీ స్థలంలో ఆఫీస్ నిర్మించాలనుకున్నా.. ఆ ఆలోచన విరమించుకున్నట్లు సమాచారం. అలాగే నానక్‌రామ్‌గూడలోని గ్రోత్‌ కారిడార్‌ బిల్డింగ్‌ను సీఎం క్యాంప్ ఆఫీసుగా మార్చే అంశంపై పరిశీలనలు జరిగినా అదీ వర్క్‌ ఔట్ కాలేదని తెలిసింది. తాజాగా బేగంపేట్‌లోని మెట్రో భవనాన్ని సీఎం క్యాంప్ ఆఫీసుగా ఖరారు చేసినట్టు సమాచారం. రెండుమూడు ప్రత్యామ్నాయాలను పరిశీలించినప్పటికీ ట్రాఫిక్‌, సెక్యూరిటీపరంగా అనుకూలంగా లేక చివరికి బేగంపేట్‌ మెట్రో భవన్‌ అయితే అన్నింటికీ అనుకూలంగా ఉంటుందనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.

సరిగ్గా 20 రోజుల కిందట సీఎం స్వయంగా MCRHD భవనాన్ని పరిశీలించి అక్కడే ఖాళీ స్థలంలో క్యాంపు కార్యాలయ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీఎం ఆదేశించిన 3 రోజులకు అక్కడ క్యాంప్ ఆఫీసు నిర్మాణానికి భూమి పూజలు కూడా జరిగాయి. కానీ, వెంటనే MCRHDలో క్యాంప్‌ ఆఫీసు నిర్మాణ ఆలోచనను సీఎం రేవంత్‌ రెడ్డి విరమించుకున్నారు. ఎందుకంటే MCRHDలో ఉద్యోగులు, అధికారులకు శిక్షణా కార్యక్రమాలు జరుగుతుంటాయి. అలాగే ఇక్కడినుంచి సెక్రటేరియట్‌కు వెళ్లే రోడ్డులో ఎప్పుడూ ఫుల్‌ ట్రాఫిక్‌ ఉంటుంది. సీఎం క్యాంపు ఆఫీసు ఇక్కడికి వస్తే రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో మరోచోట క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

మూడు రోజుల కిందట నానక్‌రామ్‌గూడలోని గ్రోత్‌ కారిడార్‌ బిల్డింగ్‌ను సందర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. క్యాంపు ఆఫీసు ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు ఆనుకుని ఉన్న ఈ బిల్డింగ్‌లో సెక్యూరిటీ పరంగా సమస్యలు వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు. దీంతో చివరగా బేగంపేట్‌లోని మెట్రో భవన్‌ను క్యాంపు కార్యాలయంగా ఏర్పాటుచేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

బేగంపేట్‌లోని మెట్రో భవన్‌.. సెక్రటేరియట్‌, అసెంబ్లీకి దగ్గరగా ఉంటుంది. సీఎం రాకపోకలకు కూడా సౌకర్యంగా ఉంటుంది. ఎలాంటి ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా మినిస్టర్ రోడ్డు, నెక్లెస్‌రోడ్డులమీదుగా సెక్రటేరియట్‌కు వెళ్లొచ్చు. జాతీయ నాయకులు ఎవరొచ్చినా, సీఎం ఢిల్లీ వెళ్లాలనుకున్నా ఎయిర్‌పోర్టు దగ్గరే ఉండటం మరో సానుకూల అంశమని భావించారు. అందుకే మెట్రో భవన్‌ను ఫైనల్‌ చేసినట్టు తెలిసింది. త్వరలోనే మెట్రో భవన్‌లోని ఆఫీసులను ఖాళీ చేయిస్తారని సమాచారం. అవసరమైన మార్పులు, చేర్పులు చేసి సీఎం క్యాంపు ఆఫీసుగా సిద్ధం చేస్తారని తెలుస్తోంది.

First Published:  8 Jan 2024 4:58 AM GMT
Next Story