Telugu Global
Telangana

సిట్ కార్యాలయంలో 25 మందికి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పెట్టిన అధికారులు!

గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 100 మార్కులకు పైగా వచ్చిన 121 మందిలో ఇప్పటి వరకు 110 మందిని పోలీసులు విచారించారు. ఇందులో అనుమానాస్పదంగా అనిపించిన 25 మందికి సిట్ అధికారులు మళ్లీ పరీక్ష పెట్టారు.

సిట్ కార్యాలయంలో 25 మందికి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పెట్టిన అధికారులు!
X

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ కేసులో సిట్ అధికారులు పకడ్బంధీగా విచారణ కొనసాగిస్తున్నారు. పోలీస్ కస్టడీలో ఉన్న ఏ10 షమీప్, ఏ11 సురేశ్, ఏ12 రమేశ్‌లను శనివారం సుదీర్ఘంగా విచారించారు. రెండు రోజుల క్రితమే ఈ ముగ్గురి ఇళ్లను సిట్ అధికారులు సోదా చేశారు. ఆ సమయంలో వారి ఇళ్ల నుంచి గ్రూప్-1 మాస్టర్ క్వశ్చన్ పేపర్, సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. మా ముగ్గురికీ ప్రవీణే ప్రశ్నాపత్రం ఇచ్చాడని వారు సిట్ అధికారులుకు చెప్పినట్లు తెలుస్తున్నది. ఒకే చోట పని చేయడం వల్ల పరిచయాలు పెరిగాయని, తమ వద్ద డబ్బులు తీసుకోలేదని ముగ్గురూ చెప్పినట్లు సమాచారం.

ఇక గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 100 మార్కులకు పైగా వచ్చిన 121 మందిలో ఇప్పటి వరకు 110 మందిని పోలీసులు విచారించారు. ఇందులో అనుమానాస్పదంగా అనిపించిన 25 మందికి సిట్ అధికారులు మళ్లీ పరీక్ష పెట్టారు. టీఎస్‌పీఎస్సీ నుంచి మోడల్ క్వశ్చన్ పేపర్ తీసుకొని వచ్చి.. సిట్ కార్యాలయంలోనే అభ్యర్థులతో పరీక్ష రాయించినట్లు సమాచారం. నిజంగా టాలెంట్ ఉంటే ఏ క్వశ్చన్ పేపర్ అయినా బాగా రాస్తారు కదా అనే ఉద్దేశంతోనే పరీక్ష పెట్టినట్లు సిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరీక్ష పేపర్లు నిపుణులతో దిద్దించిన తర్వాత వారిని మళ్లీ విచారిస్తారని అంటున్నారు.

ఇక శనివారం టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ను కూడా పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. తన పీఏ అయిన ప్రవీణ్ గ్రూప్-1 పరీక్ష రాస్తున్నాడని తెలిసి సెలవు మీద ఎందుకు పంపలేదని సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. రోజూ జాబ్‌కు వస్తూ.. ఎలాంటి కోచింగ్ లేకపోయినా 100కు పైగా మార్కులు సంపాదించడంపై అనుమానం ఎందుకు రాలేదని కూడా అడిగినట్లు తెలుస్తున్నది. మరోవైపు కమిషన్ సభ్యుడు లింగారెడ్డిని రెండు గంటల పాటు విచారించారు. లింగారెడ్డికి అసిస్టెంట్‌గా పని చేసిన రమేశ్‌ వద్ద కూడా గ్రూప్-1 ప్రశ్నాపత్రం ఉన్నది.

ప్రవీణ్ ద్వారానే రమేశ్ ప్రశ్నాపత్రం సంపాదించాడు. అయితే రమేశ్‌కు అన్ని మార్కులు వస్తే ఎందుకు అనుమానం రాలేదని లింగారెడ్డిని ప్రశ్నించారు. అంతే కాకుండా రమేశ్ ఎన్నాళ్ల నుంచి సహాయకుడిగా పని చేస్తున్నాడు? అతడి ప్రవర్తనపై ఏనాడైనా అనుమానం కలిగిందా అని కూడా అడిగినట్లు తెలిసింది. అయితే, తనకు రమేశ్ గ్రూప్-1 పరీక్ష రాసినట్లు తెలియదని సిట్ అధికారులకు లింగారెడ్డి చెప్పినట్లు సమాచారం. ఒక సమయంలో లింగారెడ్డి, రమేశ్‌లను ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నలు అడిగారని... అతడే మీ పీఏనా అని కూడా ప్రశ్నించినట్లు సమాచారం. అతడే అని లింగారెడ్డి ధృవీకరించినట్లు సిట్ వర్గాలు చెబుతున్నాయి.

First Published:  2 April 2023 1:08 AM GMT
Next Story