Telugu Global
Telangana

వీఆర్ఏల సర్దుబాటు ప్రక్రియకు ఆటంకం.. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టే

రాష్ట్రం ప్రభుత్వం జీవోల జారీకి ముందు ఉన్న యథాతథస్థితినే కొనసాగించాలని తాజాగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

వీఆర్ఏల సర్దుబాటు ప్రక్రియకు ఆటంకం.. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టే
X

తెలంగాణలోని రెవెన్యూ శాఖలో పని చేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)లను వివిధ ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు స్టే ఇచ్చింది. వీఆర్ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయడంపై జారీ చేసిన జీవోలను తాజాగా ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. రాష్ట్రం ప్రభుత్వం జీవోల జారీకి ముందు ఉన్న యథాతథస్థితినే కొనసాగించాలని తాజాగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వీఆర్ఏల సర్దుబాటు ప్రక్రియకు తాత్కాలికంగా ఆటంకం కలిగింది.

రాష్ట్రంలోని గ్రామ సహాయకుల సర్దుబాటు కోసం ఇటీవలే జీవో విడుదల చేసింది. వీఆర్ఏల కోసం 14,954 పోస్టులను కొత్తగా మంజూరు చేసింది. రెవెన్యూ శాఖలో 2,451 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 2,113 రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు, 679 సబార్డినేట్ పోస్టులు మంజూరు చేసింది. అలాగే మిషన్ భగీరథలో 3.372 హెల్పర్ పోస్టులు, నీటిపారుదల శాఖలో 5,063 లష్కర్, హెల్పర్ పోస్టులు, పురపాలక శాఖలో 1.266 వార్డు ఆఫీసర్ పోస్టులను కేటాయించింది. వీఆర్ఏలను వారి విద్యార్హతలను బట్టి ఆయా శాఖల్లో కొత్తగా ఏర్పాటు చేసిన పోస్టుల్లో సర్దు బాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటికే వీఆర్ఏల సర్దుబాటు కోసం మంత్రి కేటీఆర్ నేతృత్వంలో మంత్రి వర్గ ఉపసంఘం చర్చలు జరిపి.. వీఆర్ఏల అభిప్రాయాలు తీసుకున్నది. ఆ తర్వాతే ఉపసంఘం సూచనల మేరకు సర్దుబాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పోస్టులు మంజూరు చేసింది. ఇప్పటికే ఆయా జిల్లాలో వీఆర్ఏలకు కొత్త పోస్టులకు సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేశారు. తాజాగా హైకోర్టు స్టే ఆర్డర్ ఇవ్వడంతో వీఆర్ఏల సర్దుబాటు ప్రక్రియకు బ్రేక్ పడింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎలా ముందకు వెళ్తుందో అని వీఆర్ఏలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

First Published:  10 Aug 2023 11:37 AM GMT
Next Story