Telugu Global
Telangana

తెలంగాణ గురుకులాల్లో 9,231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఈ నెల 12న వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతుందని.. 17 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ తెలిపారు.

తెలంగాణ గురుకులాల్లో 9,231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
X

తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ వెలువడింది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు జారీ అవగా.. వాటికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్నది. తాజాగా గురుకులాల్లో ఖాళీగా ఉన్న 9,231 పోస్టులను భర్తీ చేయడానికి నిర్ణయించారు. ఈ మేరకు గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (ట్రిబ్) నోటిఫికేషన్ విడుదల చేసింది.

గురుకుల విద్యా సంస్థల్లో ఉన్న ఖాళీలను ఏక కాలంలో భర్తీ చేయాలని ప్రభుత్వం భావించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డిసెంబర్‌లోనే విడుదల కావల్సి ఉంది. అయితే ఎన్ని ఖాళీలు ఉన్నాయి.. ఏయే పోస్టులు భర్తీ చేయాల్సి ఉందనే వివరాలను క్రోడీకరించడంలో కాస్త ఆలస్యమైంది. తాజాగా 9,231 పోస్టులను భర్తీ చేయాలని ఆయా గురుకుల సొసైటీలు ట్రిబ్‌కు వివరాలు పంపించాయి. దీంతో ట్రిబ్ వాటి భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

తెలంగాణ గురుకులాల్లో వివిధ కేటగిరీల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ట్రిబ్ నోటిఫికేషన్‌లో పేర్కొన్నది. ఖాళీల వివరాలను తెలియజేస్తూ ట్రిబ్ కన్వీనర్ డాక్టర్ మల్లయ్య భట్టు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 12 నుంచి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతుందని.. 17 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.

1. లెక్చరర్/ఫిజికల్ డైరెక్టర్/ లైబ్రేరియన్ (డిగ్రీ కాలేజీల్లో ) - 868

2. జూనియర్ లెక్చరర్/ఫిజికల్ డైరెక్టర్/లైబ్రేరియన్ (జూనియర్ కాలేజీల్లో) - 2008

3. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ - 1276

4. లైబ్రేరియన్ (స్కూల్స్) - 434

5. ఫిజికల్ డైరెక్టర్ (స్కూల్స్) - 275

6. డ్రాయింగ్ టీచర్స్/ఆర్ట్ టీచర్స్ - 134

7. క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్స్/క్రాఫ్ట్ టీచర్స్ - 92

8. మ్యూజిక్ టీచర్స్ - 124

9. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ - 4020

మొత్తం - 9,231

First Published:  6 April 2023 6:48 AM GMT
Next Story