Telugu Global
Telangana

తెలంగాణ కాదు.. తమిళనాడులోనే కార్నింగ్ రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పరిస్థితులు మారిపోయాయి. కార్నింగ్ తెలంగాణ నుంచి తరలిపోతుందని వార్తలు వచ్చాయి.

తెలంగాణ కాదు.. తమిళనాడులోనే కార్నింగ్ రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి
X

అమెరికాకు చెందిన ప్రముఖ గొరిల్లా గ్లాస్ తయారీ సంస్థ కార్నింగ్ తెలంగాణను కాదని తమిళనాడులో రూ.1003 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. కాంచీపురం జిల్లాలోని పిళ్లైపాక్కంలో ఈ సంస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం తమిళనాడు ప్రభుత్వంతో మంగళవారం ఒప్పందం చేసుకుంది ఆ సంస్థ‌. ఆప్టిమస్‌ ఇన్‌ఫ్రాకామ్‌ లిమిటెడ్‌తో భారత్‌ ఇన్నోవేటివ్‌ గ్లాస్ టెక్నాలజీస్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ పేరిట సంయుక్తంగా ఈ సంస్థను నెలకొల్పనుంది. ఈ సంస్థలో మొబైల్ ఫోన్లు, ట్యాబ్స్‌, లాప్‌టాప్స్‌కు సంబంధించిన కవర్ గ్లాస్‌ను తయారు చేయనున్నారు. ఈ సంస్థ ద్వారా దాదాపు 840 మందికి ఉపాధి లభించనుంది. కార్నింగ్ సంస్థ యాపిల్‌కు సైతం తన ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. ఇండియాలో కార్నింగ్‌కు ఇదే తొలి పెట్టుబడి.

అయితే కార్నింగ్ సంస్థ ముందుగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుంది. అప్పటి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో చర్చలు సైతం జరిగాయి. మంత్రి కేటీఆర్ సైతం తెలంగాణలో కార్నింగ్ సంస్థ రూ.934 కోట్ల పెట్టుబడులు పెట్టబోతుందని.. దీంతో 800 మందికి ఉద్యోగాలు రానున్నాయని అప్పట్లో ట్వీట్ చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పరిస్థితులు మారిపోయాయి. కార్నింగ్ తెలంగాణ నుంచి తరలిపోతుందని వార్తలు వచ్చాయి. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కార్నింగ్ ప్రతినిధులతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. చివరకు తమిళనాడులోనే ప్లాంట్ పెట్టేందుకు కార్నింగ్ సిద్ధమైంది. తమిళనాడులో ఎలక్ట్రానిక్స్ ఎకోసిస్టమ్ మెరుగ్గా ఉండటంతోపాటు.. ఇతర ఆపిల్ సప్లయర్లు కూడా దగ్గరగా ఉంటారనే కారణంతోనే తమిళనాడులో ప్లాంట్ పెట్టేందుకు కార్నింగ్ అంగీకరించిందని సమాచారం.

First Published:  24 Jan 2024 4:14 AM GMT
Next Story