Telugu Global
Telangana

'మనీ డే' TSRTC వినూత్న ప్రయోగం

సోమవారం రోజు డిపోల్లో ఉన్న అదనపు బస్సులన్నింటినీ రోడ్డెక్కించడంతో పాటు వీలైనంత వరకు సిబ్బంది సెలవుల్లో లేకుండా చూసుకున్నారు. ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాల్లో అదనపు బస్సు సర్వీసులు నడిపారు. గళ్లాపెట్టెను కాస్త ఎక్కువగా నింపారు.

మనీ డే TSRTC వినూత్న ప్రయోగం
X

మండే (సోమవారం), TSRTC పరిభాషలో ఇప్పుడు మండే కాస్తా మనీడే గా మారింది. అంటే ఆర్టీసీకి అదనపు ఆదాయం తెచ్చే రోజు అన్నమాట. దీనికోసం TSRTC ఓ వినూత్న ప్రయోగం కూడా చేపట్టింది. ఆ ప్రయోగం సక్సెస్ అయింది. సోమవారం నిజంగానే మనీడే గా మారింది, అదనపు ఆదాయం తెచ్చిపెట్టింది. ఇది ఎలా సాధ్యమైంది..?

సహజంగా ప్రభుత్వ కార్యాలయాలన్నీ సోమవారం ఫుల్ రష్ గా ఉంటాయి. శని, ఆదివారాల్లో తాకిడి తక్కువగా ఉంటుంది కాబట్టి.. ఆస్పత్రుల్లో కూడా సోమవారం అపాయింట్ మెంట్ లు ఎక్కువ. దాదాపుగా ఆఫీస్ లకు సెలవు పెట్టేవారి సంఖ్య కూడా ఆరోజు తక్కువగానే ఉంటుంది. అంటే సోమవారం ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయని అర్థం. ఆ ప్రయాణాలను సమర్థంగా వినియోగించుకుంటే ఆర్టీసీ ఆదాయం పెరుగుతుందనేది అధికారుల ఆలోచన. ఆ ఆలోచనను అమలులో పెట్టారు, గత సోమవారం ప్రయోగాత్మకంగా అధిక ఆదాయం రాబట్టారు.

ప్రయోగం ఎలా..?

సోమవారం ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది సరే మరి ఆర్టీసీకి ఆదాయంఎలా వస్తుంది..? వారంతా ఆర్టీసీ బస్సులే ఎక్కుతారనే గ్యారెంటీ ఏంటి..? దీనికోసమే అధికారులు కసరత్తులు మొదలు పెట్టారు. ఈనెల 15 సోమవారం రోజు డిపోల్లో ఉన్న అదనపు బస్సులన్నింటినీ రోడ్డెక్కించడంతో పాటు వీలైనంత వరకు సిబ్బంది సెలవుల్లో లేకుండా చూసుకున్నారు. ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాల్లో అదనపు బస్సు సర్వీసులు నడిపారు. గళ్లాపెట్టెను కాస్త ఎక్కువగా నింపారు.

ఈనెల 15న రికార్డు స్థాయి ఆదాయం

ఈనెల 15సోమవారం TSRTC ఈ ప్రయోగం చేపట్టింది. సాధారణంగా ప్రతి రోజూ సగటున 17కోట్ల రూపాయల ఆదాయం ఆర్టీసీకి వస్తుంది. ఆరోజు అదనపు బస్సుల్ని రోడ్లపైకి తేవడం, సిబ్బందికి సెలవలు లేకుండా చూసుకోవడంతో అదనంగా 3కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అంటే సోమవారం ఆదాయం రూ.20 కోట్లు. పండగ సీజన్ కాకపోయినా సోమవారం అధిక ఆదాయం వస్తుందని నిరూపించారు అధికారులు. ఇకపై ప్రతి సోమవారం కూడా ఇదే పద్ధతి ఫాలో కావాలని సూచించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.

First Published:  24 May 2023 4:35 AM GMT
Next Story