Telugu Global
Telangana

నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ.. రూల్స్ ఇవే.!

నామినేషన్ దాఖలు చేయడానికి కనీసం ఒక రోజు ముందు, ప్రతి అభ్యర్థి తన ఎన్నికల వ్యయాన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేక బ్యాంక్ అకౌంట్‌ని తెరవాలి. బ్యాంక్ అకౌంట్‌ రాష్ట్రంలో ఎక్కడైనా తెరవవచ్చు.

నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ.. రూల్స్ ఇవే.!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేటి నుంచి కీలకఘట్టం ప్రారంభంకానుంది. నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం మొదలు కానుంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తి చేసి.. ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పలువురు ఆశావహులు నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 119 నియోజకవర్గాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 10 వరకు అభ్యర్థులు ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఈనెల 13న నామినేషన్ల పరిశీలన చేయనుండగా.. ఈనెల 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీగా నిర్ణయించారు. ఈ నెల 30న పోలింగ్ నిర్వహించి.. డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు చేపడతారు.

నిబంధనలు ఇవే..

- ఒక్కో అభ్యర్థి ఒక్కో నియోజకవర్గం నుంచి నాలుగు సెట్ల నామినేషన్ దాఖలు చేయవచ్చు.

- ఒక అభ్యర్థి రెండు నియోజకవర్గాలకు మించి పోటీ చేయరాదు.

- నామినేషన్ వేసే టైంలో అభ్యర్థితో పాటు ఐదుగురిని మాత్రమే RO రూమ్‌లోకి అనుమతిస్తారు.

- నామినేషన్ దాఖలు టైంలో RO, ARO ఆఫీసు సమీపంలోని 100 మీటర్ల పరిధిలో గరిష్టంగా మూడు వాహనాలకు మాత్రమే పర్మిషన్.

- నామినేషన్‌ ప్రక్రియ, ఆఫీసు వెలుపల వీడియో, సీసీటీవి ద్వారా రికార్డు చేస్తారు.

- నామినేషన్ దాఖలు చేయడానికి కనీసం ఒక రోజు ముందు, ప్రతి అభ్యర్థి తన ఎన్నికల వ్యయాన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేక బ్యాంక్ అకౌంట్‌ని తెరవాలి. బ్యాంక్ అకౌంట్‌ రాష్ట్రంలో ఎక్కడైనా తెరవవచ్చు.

- నామినేషన్‌తో పాటు అభ్యర్థి తన నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడిస్తూ ఫామ్‌-26లో అఫిడవిట్‌ దాఖలు చేయాలి.

ఆన్‌లైన్‌లోనూ నామినేషన్లు సమర్పించవచ్చని అధికారులు తెలిపారు. ఇందుకోసం సువిధ పోర్టల్‌ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆన్‌లైన్‌లో నామినేషన్ సమర్పించినప్పటికీ..అభ్యర్థి ఆ ప్రతిపై సంతకం చేసి నిర్దిష్ట గడువులోగా రిటర్నింగ్ అధికారికి అందించాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అభ్యర్థి అయితే ఒకరు ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఇతరులకు పది మంది ప్రతిపాదించాల్సి ఉంటుంది. ప్రతిపాదించే వారంతా అదే నియోజకవర్గానికి చెందినవారై ఉండాలి.

ఇవాల్టి నుంచి ఎన్నికల వ్యయ పరిశీలకులు రంగంలోకి దిగనున్నారు. ఇందుకోసం 60 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన IRS, IRSAలను నియమించింది ఈసీ. 39 మంది ఐపీఎస్ అధికారులను శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం నియమించారు.

First Published:  3 Nov 2023 1:57 AM GMT
Next Story