Telugu Global
Telangana

ముగిసిన నామినేషన్ల పరిశీలన.. రిజెక్ట్‌ అయినవారిలో ప్రముఖులు..!

పలువురు నేతలు ప్రత్యర్థుల నామినేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఖమ్మంలో బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌ సమర్పించిన అఫిడవిట్ నిబంధనల మేరకు లేదంటూ మాజీమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల ఫిర్యాదు చేశారు.

ముగిసిన నామినేషన్ల పరిశీలన.. రిజెక్ట్‌ అయినవారిలో ప్రముఖులు..!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ల పరిశీలన సోమవారం ముగిసింది. కొన్ని నియోజకవర్గాల్లో భారీగా నామినేషన్లు దాఖలు కాగా.. కొందరు నాయకులు ప్రత్యర్థుల నామినేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ కారణంగా వాటిని పరిశీలించేందుకు అధికారులకు ఎక్కువ సమయం పట్టింది. దీంతో పరిశీలన ప్రక్రియ అర్ధరాత్రి వరకు సాగింది.

రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు మొత్తం 4 వేల 798 మంది నామినేషన్లు వేశారు. వాటిలో 608 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నిబంధనల ప్రకారం ఒక్కో అభ్యర్థి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు మించి పోటీ చేయరాదు. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు రెండు కన్నా ఎక్కువ స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. సపవత్‌ సుమన్ అనే వ్యక్తి నాలుగు నియోజకవర్గాల్లో నామినేషన్లు వేయగా.. మొహ్మద్ అక్రం అలీ ఖాన్‌ మూడు చోట్ల నామినేషన్లు వేశారు. దీంతో అధికారులు తేదీ, సమయం ప్రామాణికంగా తీసుకుని ముందుగా వేసిన నామినేషన్లను ఆమోదించారు.

ఇక నాగార్జున సాగర్‌లో మాజీమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్ జానారెడ్డి, కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్, హుజురాబాద్‌లో ఈటల సతీమణి జమున నామినేషన్లు తిరస్కరణకు గురైన ప్రముఖుల్లో ఉన్నారు. తిరస్కరించిన నామినేషన్ల వివరాలను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఇక పలువురు నేతలు ప్రత్యర్థుల నామినేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఖమ్మంలో బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌ సమర్పించిన అఫిడవిట్ నిబంధనల మేరకు లేదంటూ మాజీమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల ఫిర్యాదు చేశారు. తుమ్మల అభ్యంతరాలను అధికారులు తోసిపుచ్చారు. ఇక దేవరకద్రలో కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్‌ రెడ్డికి రెండు చోట్ల ఓటు హక్కు ఉందంటూ బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఆయన అప్పటికే రెండో ఓటును రద్దు చేయాలని దరఖాస్తు చేసుకోగా.. అధికారులు ఆమోదించారు. అలంపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌ ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే నామినేషన్ వేశారంటూ ప్రత్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలను అధికారులు పట్టించుకోలేదు.

First Published:  14 Nov 2023 2:32 AM GMT
Next Story