Telugu Global
Telangana

నామినేటెడ్ పోస్ట్ లు రద్దు.. రేవంత్ రెడ్డిపై ఒత్తిడి పెరిగినట్టేనా..?

తొమ్మిదిన్నరేళ్లుగా అధికారానికి దూరంగా ఉండటంతో కాంగ్రెస్ లో కూడా పొలిటికల్ నిరుద్యోగులు చాలామంది కనపడుతున్నారు. వారంతా ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ ల వైపు ఆశగా చూస్తున్నారు.

నామినేటెడ్ పోస్ట్ లు రద్దు.. రేవంత్ రెడ్డిపై ఒత్తిడి పెరిగినట్టేనా..?
X

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాత ప్రభుత్వం భర్తీ చేసిన పోస్టులన్నీ రద్దయ్యాయి. కొంతమంది వారికి వారే రాజీనామాలు సమర్పించగా, మిగతా వారిని తొలగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ సలహాదారుల పదవులన్నీ తొలగించారు, ఇప్పుడు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వైస్ చైర్మన్లను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇటీవల బీఆర్ఎస్ లో కొంతమంది ఎమ్మెల్యే టికెట్లు ఆశించిన వారికి కూడా కార్పొరేషన్ల చైర్మన్ పదవులిచ్చి అలక తీర్చారు కేసీఆర్. అలాంటివారంతా ఇప్పుడు పదవులకు దూరమయ్యారు. బీఆర్ఎస్ ఓటమితో ఈ పరిణామం తప్పదనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుందనేదే తేలాల్సి ఉంది.

తొమ్మిదిన్నరేళ్లుగా అధికారానికి దూరంగా ఉండటంతో కాంగ్రెస్ లో కూడా పొలిటికల్ నిరుద్యోగులు చాలామంది కనపడుతున్నారు. వీరిలో కొంతమందికి ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించింది. పోటీకి ఛాన్స్ దొరకనివారు, త్యాగాలు చేసినవారు, పార్టీకోసం నమ్మకంగా పనిచేస్తున్నవారంతా ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ ల వైపు ఆశగా చూస్తున్నారు. మరి వారికి న్యాయం జరుగుతుందో లేదో చూడాలి.

అన్ని పోస్ట్ లు అవసరమా..?

నామినేటెడ్ పోస్ట్ లు అనేవి అధికార పార్టీ నాయకులకోసమే అనేది బహిరంగ రహస్యం. అయితే కాంగ్రెస్ కూడా ఇదే ఆనవాయితీ కొనసాగిస్తుందా.. లేక పోస్ట్ ల విషయంలో పరిమితి విధిస్తుందా..? అనేది చూడాల్సి ఉంది. రాష్ట్రం అప్పుల్లో ఉంది, అన్ని విభాగాలపై అప్పుల భారం ఉందని.. అధికారంలోకి వచ్చినప్పటినుంచి కాంగ్రెస్ ఆరోపిస్తోంది, గత ప్రభుత్వంపై నిందలు వేస్తోంది. ఇంత భారం ఉన్నప్పుడు.. సలహాదారులు, నామినేటెడ్ పోస్ట్ లతో కాంగ్రెస్ కూడా ఆ భారాన్ని మరింత పెంచుతుందా..? లేదా అవసరమైన మేరకే పోస్ట్ లు భర్తీ చేస్తారా..? అనేది సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ లో ఆశావహుల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే.. నామినేటెడ్ పోస్ట్ లు మరిన్ని పెంచాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆ సాహసం చేయలేరు. అలాగని ఉన్న పోస్ట్ లను ఖాళీగా ఉంచినా నేతలు ఒప్పుకోరు. పరోక్షంగా ఒత్తిడి పెంచుతారు. ఈ దశలో ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

*

First Published:  11 Dec 2023 6:44 AM GMT
Next Story