Telugu Global
Telangana

నోబెల్స్ వర్సెస్ గోబెల్స్.. హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

పాలమూరుపై ప్రతిపక్షాలు అపశకునాలు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. పాలమూరు ఆపేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు ఎన్నో కుట్రలు పన్నారని, ప్రజలకు పగోళ్ళలా పని చేస్తున్నారని విమర్శించారు.

నోబెల్స్ వర్సెస్ గోబెల్స్.. హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు
X

తెలంగాణలో రాబోయే ఎన్నికలలో నోబెల్స్‌ కు గోబెల్స్‌ కు మధ్య పోటీ జరగబోతోందని అన్నారు మంత్రి హరీష్ రావు. ఉదాత్తమైన ఆశయంతో పనిచేస్తున్న కేసీఆర్ కి, నోరు తెరిస్తే అసత్యాలు, అబద్ధాలు చెప్పే ప్రతిపక్షాలకు మధ్య పోటీ అని అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ దేనని చెప్పారు. పాలమూరుపై ప్రతిపక్షాలు అపశకునాలు మాట్లాడుతున్నాయని మండిపడ్డారాయన. పాలమూరు ఆపేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు ఎన్నో కుట్రలు పన్నారని, ప్రజలకు పగోళ్ళలా పని చేస్తున్నారని విమర్శించారు. పాలమూరు ప్రజలపై కాంగ్రెస్ పగ సాధించాలనుకుంటోందన్నారు. సీతారామ ఎత్తిపోతల పనులు చివరి దశలో ఉన్నాయని, మరో మూడు నెలలో ఆ ప్రాజెక్ట్ పూర్తి అవుతుందన్నారు. ఖమ్మం జిల్లాలో కృష్ణా, గోదావరి జలాలతో ఇక కరువనేదే ఉండదని పేర్కొన్నారు హరీష్ రావు.

అన్నిట్లో నెంబర్-1

కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో నెంబర్-1 గా ఎదుగుతోందని చెప్పారు మంత్రి హరీష్ రావు. ధాన్యం ఉత్పత్తిలో అయినా, డాక్టర్ల ఉత్పత్తిలో అయినా తెలంగాణే నెంబర్-1 అన్నారు. 50 ఏళ్లలో కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. బీజేపీ ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఏంచేస్తోందని, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఫథకాలలో ఒక్కటైనా వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అమలు చేస్తున్నాయా అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పగటి కలలు కంటోందని ఎద్దేవా చేశారు.


ఆర్టీసీ ఉద్యోగులకు శుభాకాంక్షలు..

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఇక వారు ప్రభుత్వ ఉద్యోగులు అయ్యారని చెప్పారు. గవర్నర్ తమిళిసై ఆర్టీసీ బిల్లుని ఆమోదించడం సంతోషకర పరిణామం అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు అన్నిరంగాల ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం కడుపులో దాచుకుని రక్షించుకుంటుందన్నారు. ఉద్యోగులకు ఇచ్చే అన్నిరకాల భత్యాలు తెలంగాణలోనే ఎక్కువ అని చెప్పారు హరీష్ రావు.

First Published:  14 Sep 2023 11:31 AM GMT
Next Story