Telugu Global
Telangana

పెట్రోల్ కి హెల్మెట్ కి లింకు.. మళ్లీ మొదలైన హడావిడి..

వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ప్రకటన విడుదల చేశారు. హెల్మెట్ ఉన్నవారికే పెట్రోల్ పోయాలని బంకుల యజమానులకు కూడా కఠిన ఆదేశాలిచ్చారు.

పెట్రోల్ కి హెల్మెట్ కి లింకు.. మళ్లీ మొదలైన హడావిడి..
X

భారత్ లో ప్లాస్టిస్ కవర్ల నిషేధం, హెల్మెట్ తో ప్రయాణం.. ఇలాంటి వన్నీ అప్పుడప్పుడూ అలా తెరపైకి వచ్చి, అంతే వేగంగా కనుమరుగవుతుంటాయి. హెల్మెట్ లేకపోతే రోడ్డుపైకి రానివ్వం, బండిపై తిరగనివ్వం, అసలు పెట్రోలే కొనకుండా అడ్డుకుంటామంటూ చాలాసార్లు ప్రభుత్వాలు, పోలీసులు స్టేట్ మెంట్లు ఇచ్చారు, ఇస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడా ఏవీ పూర్తిస్థాయిలో అమలు కాలేదు. అమలవుతాయనే ఆశ కూడా లేదు. కానీ ఈసారి వరంగల్ పోలీసులు మాత్రం తగ్గేదే లేదంటున్నారు. హెల్మెట్ ఉంటేనే బండిలో పెట్రోల్ అనే కాన్సెప్ట్ ని మళ్లీ తెరపైకి తెచ్చారు. హెల్మెట్ ఉన్నవారికే పెట్రోల్ పోసేలా బంకుల యజమానులకు ఆదేశాలిచ్చారు. హెల్మెట్ల వాడకాన్ని ఇలాగైనా తప్పనిసరి చేస్తామంటున్నారు, ఈసారి తగ్గేదే లేదంటున్నారు. అయితే ఈ సినిమా డైలాగ్ ఎన్ని రోజులు లైమ్ లైట్ లో ఉంటుందో చూడాలి.

ఆగస్ట్ 15నుంచి కఠినంగా అమలు..

హెల్మెట్ లేకుండా వాహనాలను నడపడం ప్రమాదకరం, కానీ ప్రజలకు ఎన్నిసార్లు అవగాహన కల్పించినా హెల్మెట్ ని లైట్ తీసుకుంటారు. కొన్నిసార్లు కేవలం హెల్మెట్ లేకపోవడం వల్లే బైక్ రైడర్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనల్ని చూస్తూ ఉంటాం. అయినా కూడా హెల్మెట్ ని తలపై భారంగా భావిస్తారు కానీ, తలకు రక్షణగా చాలామంది అనుకోరు. అలాంటి వారందరికీ అది తప్పనిసరి చేయాలనే ఉద్దేశంతో నో హెల్మెట్-నో పెట్రోల్ అనే నిబంధన తీసుకొస్తున్నారు వరంగల్ పోలీసులు. గతంలో కూడా ఇలాంటి నిబంధనలు తెరపైకి వచ్చినా, ఈసారి స్వాతంత్ర వజ్రోత్సవాల వేళ కఠినంగా అమలు చేస్తామని నమ్మకంగా చెబుతున్నారు. వరంగల్, హన్మకొండ, కాజీపేట.. ట్రై సిటీస్ పరిధిలో ఈ నిబంధన అమలులోకి వస్తోంది. ఈమేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ప్రకటన విడుదల చేశారు. హెల్మెట్ ఉన్నవారికే పెట్రోల్ పోయాలని బంకుల యజమానులకు కూడా కఠిన ఆదేశాలిచ్చారు.

2021 సంవత్సరంలో వ‌రంగ‌ల్ పోలీసు క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో 1,106 రోడ్డుప్ర‌మాదాలు జరగగా, అందులో 426 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో టూవీలర్ పై ప్రయాణించినవారే ఎక్కువ. గాయపడిన 1,110 మందిలో కూడా వారి సంఖ్యే అధికం. అందుకే టూవీలర్ ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెబుతున్నారు కమిషనర్. హెల్మెట్ లేకపోవడం వల్ల జరిగే మరణాల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని, స్వాతంత్ర దినోత్సవం రోజున దీన్ని మొదలు పెడుతున్నామని చెప్పారు.

First Published:  12 Aug 2022 1:57 AM GMT
Next Story