Telugu Global
Telangana

తెలంగాణ నార్తరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదు.. జర జాగ్రత్త

ఇలాంటి ఉద్యోగ ప్రకటనలు ఏవైనా కనపడితే.. వెంటనే టీఎస్ఎన్‌పీడీసీఎల్ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సీఎండీ గోపాలరావు సూచించారు.

తెలంగాణ నార్తరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదు.. జర జాగ్రత్త
X

తెలంగాణ ప్రభుత్వం వరుసగా జాబ్ నోటిఫికేషన్లు వేస్తోంది. గత కొన్ని నెలలుగా నిరుద్యోగులు ఏ రోజు ఏ నోటిఫికేషన్ వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తమ అర్హతలకు తగిన నోటిఫికేషన్ రాగానే.. అప్లై చేయడానికి అన్ని సర్టిఫికేట్లు దగ్గర పెట్టుకుంటున్నారు. అంతే కాకుండా పరీక్షల్లో మంచి ప్రతిభ కనపరిచి ఉద్యోగాలు పొందాలని కూడా ఆశిస్తున్నారు. ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4తో పాటు పోలీస్, డాక్టర్, స్టాఫ్ నర్స్ వంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడ్డాయి. వీటిలో కొన్నింటి నియమక ప్రక్రియ కూడా కొనసాగుతున్నది.

ఈ క్రమంలో తెలంగాణ స్టేట్ నార్తరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీఎస్ఎన్‌పీడీసీఎల్) పలు పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసిందని పలు మీడియాల్లో వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇదే అంటూ సోషల్ మీడియాలో కూడా పోస్టులు హల్ చల్ చేశాయి. దీనిపై నార్తరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సీఎండీ గోపాల్ రావు స్పందించారు. జాబ్ నోటిఫికేషన్ జారీ చేశామని వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. నిరుద్యోగులు అలాంటి నోటిఫికేషన్లను నమ్మవద్దని ఆయన హెచ్చిరించారు.

టీఎస్ఎన్‌పీడీసీఎల్ 157 ఉద్యోగాల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ సత్య దూరం అన్నారు. వాస్తవానికి ఆడిట్ కోసం చార్టెడ్ అకౌంటెంట్ సంస్థల సేవల కోసం మాత్రమే ఒక ప్రకటన జారీ చేశామని, 157 యూనిట్ల కోసం ప్రకటన ఇవ్వగా.. దీనిని 157 ఉద్యోగాలుగా వక్రీకరించారని ఆయన తెలిపారు. కొన్ని వార్తా సంస్థలు కూడా ప్రకటనను పొరపాటుగా జాబ్ నోటిఫికేషన్‌గా పొరబడినట్లు ఆయన తెలిపారు.

ఇలాంటి ఉద్యోగ ప్రకటనలు ఏవైనా కనపడితే.. వెంటనే టీఎస్ఎన్‌పీడీసీఎల్ అధికారిక వెబ్‌సైట్ చూడాలని ఆయన సూచించారు. వరుసగా ఉద్యోగ ప్రకటనలు వెలువడుతున్న నేపథ్యంలోనే చాలా మంది పొరబడ్డారని ఆయన తెలిపారు. మరోసారి ఇలాంటి గందరగోళానికి గురి కావొద్దని ఆయన తెలిపారు. కాగా, టీఎస్ఎన్‌పీడీసీఎల్ సంస్థ తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విద్యుత్ సరఫరా చేస్తుంది.

First Published:  4 Jan 2023 1:46 AM GMT
Next Story