Telugu Global
Telangana

గ్రూప్-1 ప్రిలిమినరీలో ఎలాంటి అవకతవకలు జరగలేదు : టీఎస్‌పీఎస్సీ

అభ్యర్థుల్లో మరింత ఆందోళన పెరగడంతో.. టీఎస్‌పీఎస్సీ వారి అనుమానాలను నివృత్తి చేసింది.

గ్రూప్-1 ప్రిలిమినరీలో ఎలాంటి అవకతవకలు జరగలేదు : టీఎస్‌పీఎస్సీ
X

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష సమయంలో బయోమెట్రిక్ ఉపయోగించకపోవడం, తొలుత ప్రకటించిన సంఖ్య కంటే ఆ తర్వాత ఎక్కువ మంది అభ్యర్థులు పరీక్ష రాసినట్లు చెప్పడం వంటి కారణాలతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. పరీక్షల్లో ఏవైనా అక్రమాలు జరిగాయేమో అనే అనుమానంతో కొంత మంది హైకోర్టుకు వెళ్లారు. దీంతో పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు డివిజన్ బెంచ్‌కు అప్పీలు చేసినా.. అదే తీర్పు వచ్చింది. దీంతో అభ్యర్థుల్లో మరింత ఆందోళన పెరగడంతో.. టీఎస్‌పీఎస్సీ వారి అనుమానాలను నివృత్తి చేసింది.

ప్రిలిమ్స్ పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేసింది. పోటీ పరీక్ష పూర్తయిన తర్వాత అదనంగా 258 ఓఎంఆర్ జవాబు పత్రాలు వచ్చాయన్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని చెప్పింది. ఒక సారి పరీక్ష పూర్తయిన తర్వాత ఓఎంఆర్ జవాబు పత్రాలు జోడించేందుకు అవకాశమే లేదని స్పష్టం చేసింది. మొదట చెప్పిన సంఖ్యకు తర్వాత చెప్పిన దానికి తేడా ఎందుకు వచ్చిందో వివరించింది.

ఈ ఏడాది జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. ఆ పరీక్షకు ఎంత మంది హాజరయ్యారనే విషయమై జిల్లా కలెక్టర్ కార్యాలయాల నుంచి టెలీ ఫోన్ ద్వారా ప్రాథమికంగా గణాంకాలు తీసుకొని అభ్యర్థులు హాజరు జాబితాను రూపొందించాము. ప్రాథమిక సమాచారం మేరకు 2,33,248 మంది పరీక్ష రాసినట్లు తెలవడంతో.. అదే సంఖ్యను మీడియాకు చెప్పాము. కాగా, ఆ తర్వాత జిల్లాల నుంచి వచ్చిన ఓఎంఆర్ పత్రాల స్కానింగ్ ప్రక్రియలో భాగంగా వాటిని తనిఖీ చేసి.. హాజరుతో లెక్కించాం. ఈ కచ్చితమైన గణనలో 2,33,506 మంది అభ్యర్థులు హాజరైనట్లు తేలింది.

భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరు కావడంతో ఆ రోజు ప్రాథమికంగా తీసుకున్న సంఖ్యకు.. ఆ తర్వాత ఓఎంఆర్ ద్వారా తెలిసిన కచ్చితమైన గణాంకాలకు మధ్య స్వల్ప తేడా తప్పకుండా ఉంటుంది. అంతే కానీ ఓఎంఆర్ పత్రాలు అదనంగా జోడించే పరిస్థితులు ఉండవు. అది అసాధ్యమని టీఎస్‌పీఎస్సీ వివరణ ఇచ్చింది. ఇక బయోమెట్రిక్ లేకపోవడం వల్ల.. ఒకరి బదులు మరొకరు పరీక్ష రాశారేమో అనే అనుమానం కూడా కరెక్ట్ కాదని చెప్పింది. మూడంచెల తనిఖీల ద్వారా అసలైన అభ్యర్థులనే అనుమతించామని చెప్పారు. ఆధార్, ఇతర ధ్రువపత్రాలు తనిఖీ చేసిన తర్వాతే అభ్యర్థులకు పరీక్ష రాసేందుకు లోపలికి పంపామని స్పష్టం చేసింది.

First Published:  29 Sep 2023 1:38 AM GMT
Next Story