Telugu Global
Telangana

గ్రేటర్ ఎన్నికలు జరిగి రెండేళ్లవుతున్నా బీజేపీకి ఫ్లోర్ లీడర్ కరువు

బండి సంజయ్, కిషన్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు వల్లే ఈ సమస్య వచ్చిందని పార్టీ అంతర్గత సమాచారం. ఫ్లోర్ లీడర్ ని ఎంపిక చేసే విషయంలో ఎవరి మాట చెల్లుబాటు కావాలనే దగ్గరే ఆ ప్రతిపాదన ఆగిపోయింది.

గ్రేటర్ ఎన్నికలు జరిగి రెండేళ్లవుతున్నా బీజేపీకి ఫ్లోర్ లీడర్ కరువు
X

బీఆర్‌ఎస్ కి జాతీయ అధ్యక్షుడిని ప్రకటించలేదు, తెలంగాణ రాష్ట్రానికి కూడా అధ్యక్షుడిని ప్రకటించలేదంటూ ఇటీవల బండి సంజయ్ నోరు పారేసుకున్నారు. ఆ గురివింద మరచిపోయిన విషయం ఏంటంటే.. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగి రెండేళ్లవుతున్నా ఇప్పటి వరకు బీజేపీకి ఫ్లోర్ లీడర్ లేకపోవడం. అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్యపోరుతో ఇప్పటి వరకూ బీజేపీ ఇంకా ఫ్లోర్ లీడర్ ని నియమించుకోలేని దుస్థితి. ఇప్పటికే నలుగురు కార్పొరేటర్లు చేజారారు. ఫ్లోర్ లీడర్ లేకపోవడంతో కనీసం ఉమ్మడిగా తమ గొంతు వినిపించడానికి కూడా అవకాశం లేకపోతోందని బీజేపీ కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీని నమ్ముకుని ఉన్నవారిని చివరకిలా నట్టేట ముంచేస్తున్నారని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జీహెచ్ఎంసీలోని మొత్తం 150 వార్డుల్లో బీఆర్ఎస్ 60 గెలుచుకుంది. 48 సీట్లతో బీజేపీ రెండో అతి పెద్ద పార్టీగా అవతరించినా ఇప్పటికే నలుగురు చేజారారు. దీంతో బీజేపీ, ఎంఐఎం బలం 44వద్ద సమానంగా ఉంది. కాంగ్రెస్ కి కేవలం 2 కార్పొరేషన్ స్థానాలు దక్కాయి.

ఫ్లోర్ లీడర్ పితలాటకం..

ఫ్లోర్ లీడర్ ని ఎంపిక చేసుకోడానికి బీజేపీ నానా తంటాలు పడుతోంది. రెండేళ్లుగా ఆ పార్టీకి ఫ్లోర్ లీడర్ లేడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గతండాది బీజేపీ కార్పొరేటర్లందరూ కలసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలసి విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు. బండి సంజయ్, కిషన్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు వల్లే ఈ సమస్య వచ్చిందని పార్టీ అంతర్గత సమాచారం. ఫ్లోర్ లీడర్ ని ఎంపిక చేసే విషయంలో ఎవరి మాట చెల్లుబాటు కావాలనే దగ్గరే ఆ ప్రతిపాదన ఆగిపోయింది.

దేవర కరుణాకర్ (గుడిమల్కాపూర్), తోకల శ్రీనివాస్ రెడ్డి (మైలార్‌ దేవ్‌ పల్లి), రాధా రెడ్డి (ఆర్కే పురం), వంగా మధుసూధన్ రెడ్డి (చంపాపేట్) పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఆకుల శ్రీవాణి (సరూర్‌ నగర్), సుప్రియా గౌడ్ (ముషీరాబాద్), రవిచారి (రాంనగర్) కూడా రేసులో ఉన్నారు. వీరిలో ఒకరిని పార్టీ అధిష్టానం ఖరారు చేసే అవకాశముంది.

వచ్చే సమావేశానికైనా..

ఇప్పటికి రెండేళ్లవుతున్నా ఫ్లోర్ లీడర్ ని నియమించుకోలేకపోవడం సిగ్గుచేటని ఆ పార్టీ నేతలే అంటున్నారు. బడ్జెట్ సమావేశాల్లో తమ గళం వినిపించేందుకు, అందరూ ఏకతాటిపైకి వచ్చేందుకు అవకాశం లేకుండా పోయిందని అన్నారు. వచ్చే కౌన్సిల్ సమావేశానికైనా ఫ్లోర్ లీడర్ నియామకం జరుగుతుందని ఆశిస్తున్నామని చెబుతున్నారు బీజేపీ కార్పొరేటర్లు. కనీసం ఫ్లోర్ లీడర్ ఉంటే.. గతేడాది నలుగురు పార్టీ ఫిరాయించి ఉండేవారు కాదని, సమన్వయం చేసుకుని ఉండేవారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో గణనీయంగా సీట్లు గెలుచుకున్నా కూడా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆధిపత్యపోరు వల్ల బీజేపీ ఇంకా తంటాలు పడుతూనే ఉంది.

First Published:  4 Jan 2023 4:31 AM GMT
Next Story