Telugu Global
Telangana

ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదు.. రేవంత్‌పై కేసు పెట్టే యోచనలో సిట్

హిమాయత్‌నగర్‌లోని సిట్ కార్యాలయానికి రేవంత్ రెడ్డి ఇవ్వాళ వచ్చారు. అధికారులు అడిగిన వాటికి సమాధానాలు చెప్పలేకపోయారు.

ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదు.. రేవంత్‌పై కేసు పెట్టే యోచనలో సిట్
X

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో గురువారం కీలక మలుపు చోటు చేసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం విచారణ కోసం సిట్‌ను నియమించిన తర్వాత కూడా టీపీసీసీ ప్రెసిడెంట్ నిరాధార ఆరోపణలు చేవారు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో ఒకే మండలంలో 100 మందికి 100 మార్కులు వచ్చాయని ఆయన మీడియా ముందు వ్యాఖ్యానించారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న సిట్.. రేవంత్ రెడ్డిని దానికి తగిన ఆధారాలు చూపాలంటూ నోటీసులు జారీ చేసింది.

హిమాయత్‌నగర్‌లోని సిట్ కార్యాలయానికి రేవంత్ రెడ్డి ఇవ్వాళ వచ్చారు. అధికారులు అడిగిన వాటికి సమాధానాలు చెప్పలేకపోయారు. అంతే కాకుండా తన వద్ద ఎలాంటి ఆధారాలు లేవని అధికారులకు చెప్పారు. విచారణను తప్పుదోవ పట్టించేలా రేవంత్ రెడ్డి కామెంట్లు చేయడంతో ఆయనపై కేసు పెట్టే యోచనలో సిట్ అధికారులు ఉన్నారు. ఆయనపై కేసు పెట్టొచ్చా లేదా అనే విషయంలో న్యాయ సలహా తీసుకుంటున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నోటికి వచ్చిన వ్యాఖ్యలు చేయడంపై సిట్ సీరియస్‌గా ఉన్నది. కాగా, విచారణకు హాజరైన రేవంత్ రెడ్డి మాత్రం తన దగ్గర ఉన్న ఆధారాలను సిట్ అధికారులకు ఇచ్చానని వ్యాఖ్యానించడం గమనార్హం.

రాజశేఖర్ ఫ్రెండ్‌కు 122 మార్కులు?

పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజశేఖర్ క్లోజ్ ఫ్రెండ్ రమేశ్‌కు గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 122 మార్కులు వచ్చినట్లు సిట్ అధికారులు గుర్తించారు. 2013లో గ్రూప్-2 ఉద్యోగం పొందిన షమీమ్.. ఈ సారి గ్రూప్-1 ప్రిలిమ్స్ రాశాడు. ఆయనకు కూడా 127 మార్కులు వచ్చినట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. తనకు రాజశేఖర్ ప్రశ్నాపత్రం ఇచ్చాడని.. ఇందుకోసం డబ్బులేమీ తీసుకోలేదని షమీప్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. తన క్లోజ్ ఫ్రెండ్ రమేశ్‌కు కూడా ఉచితంగానే ప్రశ్నాపత్రం ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇక నిందితుల మొబైల్ ఫోన్లలోని కాల్ డేటా, వాట్సప్ గ్రూప్ చాటింగ్స్, ఇతర చాటింగ్స్‌ను నిఘా బృందాలు ఆరా తీస్తున్నాయి. కమిషన్‌లోని వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న 8 మంది గతేడాది జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరైనట్లు గుర్తించారు. వీరిలో చాలా మందికి 100కు పైగా మార్కులు వచ్చినట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. వీరందరినీ సిట్ కార్యాలయానికి పిలిచి విచారించనున్నారు. వీళ్ల ద్వారా మరింత సమాచారం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

First Published:  23 March 2023 12:54 PM GMT
Next Story