Telugu Global
Telangana

హైదరాబాద్‌లో జరిగే పాకిస్తాన్-న్యూజీలాండ్ మ్యాచ్‌కు ప్రేక్షకులకు నో ఎంట్రీ

ఈ నెల 29న పాకిస్తాన్-న్యూజీలాండ్ మధ్య జరిగే మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించకూడదని బీసీసీఐ నిర్ణయించింది.

హైదరాబాద్‌లో జరిగే పాకిస్తాన్-న్యూజీలాండ్ మ్యాచ్‌కు ప్రేక్షకులకు నో ఎంట్రీ
X

భారత్ ఆతిథ్యం ఇస్తున్న వన్డే క్రికెట్ వరల్డ్ కప్-2023 అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్నది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకు 5 మ్యాచ్‌లు కేటాయించారు. ఇందులో రెండు వార్మప్ మ్యాచ్‌లు కాగా.. ఇండియా జట్టు ఆడే ఒక్క మ్యాచ్ కూడా లేకపోవడంతో క్రికెట్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. వార్మప్ మ్యాచ్‌లు రెండు పెద్ద జట్లతోనే ఉండటంతో కాస్త ఊరట లభించింది. కానీ ఇప్పుడు ఆ రెండు వార్మప్ మ్యాచ్‌లలో ఒక దానికి ప్రేక్షకులను అనుమతించబోవడం లేదు.

ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 29, అక్టోబర్ 3న రెండు వార్మప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ నెల 29న పాకిస్తాన్-న్యూజీలాండ్ మధ్య జరిగే మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. వినాయక చవితి నిమజ్జనం (ఈ నెల 28) తర్వాతి రోజు వార్మప్ మ్యాచ్ ఉండటంతో స్టేడియం వద్ద భద్రత ఏర్పాటు చేయలేమని రాచకొండ పోలీసులు ఇప్పటికే హెచ్‌సీఏకే తెలిపారు. 29న కూడా నిమజ్జనాలు కొనసాగుతూనే ఉంటాయని.. దీంతో ఆ రోజు జరిగే మ్యాచ్‌కు భద్రత ఇవ్వడం కష్టమవుతుందని పేర్కొన్నారు. ఇదే విషయం బీసీసీఐకి హెచ్‌సీఏ లేఖ రాసింది.

ఈ నెల 29న జరిగేది కేవలం వార్మప్ మ్యాచ్ కావడంతో ప్రేక్షకులను అనుమతించ కూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికిప్పుడు వేదిక మార్చడం కష్టంతో కూడుకున్నది కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బులు రిఫండ్ చేయనున్నట్లు బీసీసీఐ అధికారి తెలిపారు. ఆ తర్వాత జరిగే వార్మప్ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించనున్నారు.

హైదరాబాద్‌లో 29న పాకిస్తాన్-న్యూజీలాండ్, అక్టోబర్ 3న పాకిస్తాన్-ఆస్ట్రేలియా మధ్య వార్మప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇక వరల్డ్ కప్ గ్రూప్ మ్యాచ్‌లు మూడింటిని హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 6న పాకిస్తాన్-నెదర్లాండ్స్, అక్టోబర్ 9న న్యూజీలాండ్-నెదర్లాండ్స్, అక్టోబర్ 12న పాకిస్తాన్-శ్రీలంక మధ్య మ్యాచ్‌లు జరుగనున్నాయి. పాకిస్తాన్ జట్టు హైదరాబాద్ స్టేడియంలో వార్మప్‌తో కలిపి నాలుగు మ్యాచ్‌లు ఆడనున్నది. న్యూజీలాండ్, నెదర్లాండ్స్ చెరి రెండు మ్యాచ్‌లు ఆడనున్నాయి.

ఇంకా వీసా రాలేదు..

పాకిస్తాన్ జట్టు మరో ఆరు రోజుల్లో హైదరాబాద్‌లో వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉండగా.. ఇంకా వీసా క్లియర్ కాకపోవడంతో ఇండియాకు బయలుదేరలేదు. ప్రస్తుతం ఇస్లామాబాద్‌లోని భారత దౌత్య కార్యాలయంలో పాకిస్తాన్ ఆటగాళ్లు, సపోర్ట్ సిబ్బంది వీసాల కోసం వెరిఫికేషన్ జరుగుతుంది. అది పూర్తయిన వెంటనే దుబాయ్ మీదుగా ఈ నెల 27న హైదరాబాద్ చేరుకుంటారని తెలుస్తున్నది.

First Published:  23 Sep 2023 1:09 PM GMT
Next Story