Telugu Global
Telangana

తెలంగాణలో పురావస్తు తవ్వకాలు చేపట్టలేదు : పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి

గోల్కొండ కోటలోని నయాఖిలా వద్ద 2019లో సైంటిఫిక్ క్లియరెన్స్ కోసం పరిశోధనలు చేపట్టినట్లు సభకు తెలిపారు.

తెలంగాణలో పురావస్తు తవ్వకాలు చేపట్టలేదు : పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి
X

తెలంగాణ రాష్ట్రంలో గత ఐదేళ్లుగా భారత పురావస్తు సర్వే శాఖ ఎలాంటి తవ్వకాలు చేపట్టలేదని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు మంత్రి కిషన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలోని చారిత్రక కట్టడాల సంరక్షణ కోసం పురావస్తు శాఖ పరిశోధనలు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

గోల్కొండ కోటలోని నయాఖిలా వద్ద 2019లో సైంటిఫిక్ క్లియరెన్స్ కోసం పరిశోధనలు చేపట్టినట్లు సభకు తెలిపారు. అలాగే 2022లో వరంగల్ కోటలోని జీపీఆర్ సర్వే నిర్వహించినట్లు పేర్కొన్నారు. నయాఖిలాలో చేపట్టిన సైంటిఫిక్ క్లియరెన్స్ వర్క్‌లో భారీ ట్యాంకులు, పురాతన ఉద్యానవనాలు, భాగ్‌కు దారితీసే మెట్లు, టెర్రాకోట పైప్‌లైన్, సమాంతర నీటి కాలువలు బయటపడినట్లు మంత్రి వెల్లడించారు.

తెలంగాణలో 1,302 మెగావాట్ల జలవిద్యుత్ సామర్థ్యం..

తెలంగాణ రాష్ట్రంలో 1,302 మెగావాట్ల జలవిద్యుత్ సామర్థ్యం ఉందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. లోక్‌సభలో ఎంపీలు నేత వెంకటేశ్, జి. రంజిత్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో భారీ, మధ్య తరహా పథకాల ద్వారా 1,302 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రాల్లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న జల విద్యుత్ కేంద్రాలను మాత్రమే అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు.

ప్రియదర్శిని జూరాల 234 మెగావాట్లు, పోచంపాడు 36 మెగావాట్లు, నాగార్జునసాగర్ 110, నాగార్జునసాగర్ ఎడమ గట్టు కాల్వ 60, లోయర్ జూరాల 240, పులిచింతల 120 మెగావాట్ల సామర్థ్యంతో పని చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లోని భూగర్భ జలాల్లో యురేనియం కాలుష్యం ఉన్నట్లు పలు అధ్యయనాల్లో తేలిందని అన్నారు. ఆదిలాబాద్, హైదరాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో దీని ప్రభావం ఉందని మంత్రి వెల్లడించారు.

First Published:  5 Aug 2023 2:31 AM GMT
Next Story